
● ఛిన్నాభిన్నమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు ● అమాయకులు, క
పుంగనూరు(చౌడేపల్లె): పుంగనూరు పట్టణానికి చెందిన కొందరు సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలను ఎంచుకున్నారు. ఏజెంట్లను నియమించుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తూ రోజూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రధానంగా లాటరీ విక్రయాలు ప్రజలు గుమికూడే టీ దుకాణాలు, పూల అంగళ్లు, ఆటోస్టాండ్, కారు పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేటు బస్టాండ్, నానాసాబ్‌పేట, మార్కెట్ యార్డు, తూర్పుమొగసాల, నగిరిప్యాలెస్ తదితర ప్రదేశాలను చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. పుంగనూరు పట్టణంలోకి కూలి పనులకు వచ్చే వారు, సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. వారికి ఆశలు కల్పించి టికెట్లను అంటగడుతున్నారు. అసలు లాటరీ టికెట్లతో పోలిన డూప్లికేట్ టికెట్లు తయారు చేసుకుని అమాయకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. తెల్లారి నుంచి సాయంత్రం 6 వరకు కష్టపడి సంపాదించిన కూలీ సొమ్ము ఖర్చయిపోతోంది తప్ప లాటరీ తగిలింది లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. లాటరీ టికెట్ల విక్రయాలను నిరోధించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయదారుల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
పుంగనూరు పట్టణంలో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాల విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా లాటరీలను నమ్ముకుని డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు. టికెట్ల విక్రేతల నుంచి మామూళ్లు తీసుకనే విషయం తనకు తెలియదని, ఇంతకు మునుపు ఏదైనా జరిగివుంటే తనకు సంబంధంలేదు.
–సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు