
మొహర్రం సెలవుపై స్పష్టత ఇవ్వండి
చిత్తూరు కలెక్టరేట్ : మొహర్రం సెలవుపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన ముస్లింల పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ప్రకటించిందన్నారు. అయితే పాఠశాలలకు ఆప్షనల్ సెలవులు వాడుకోవచ్చా లేదా అనే సందిగ్ధం నెలకొందన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తుంటే ఎలాంటి స్పందన లేదన్నారు. గత వారంలో రథయాత్రకు సైతం సెలవు ప్రకటించి చివరి నిమిషంలో రద్దు చేసి విధులు నిర్వహించాలన్నారు. ముందుగానే ఆప్షనల్ సెలవు పై నిర్ణయం ప్రకటించాలని కోరారు.
గిరిజన భవనం
ఏర్పాటు చేయండి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో గిరిజన భవనం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి, ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖా మంత్రి రాందాస్ అతవాలేకు వినతి పత్రం అందజేశారు. మంత్రితో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో గిరిజన భవనం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు.
మా బియ్యం ఎక్కడ?
– రేషన్ షాపు ఎదుట కార్డుదారుల నిరసన
పాలసముద్రం : మండలంలోని రాచపాల్యం 10వ నంబర్ రేషన్ షాపు వద్ద కార్డుదారులు నిరసన వ్యక్తం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ రేషన్ షాపు పరిధిలో ఎస్‌బీఆర్ పురం, రాచపాళ్యం, మణిపురం గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డుదారులు ఉన్నారు. గ్రామానికి కిలో మీటర్ల దూరంలోని పాలసముద్రం రైతు సేవా కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ బియ్యం పంపిణీ చేశారు. ఆపై సుమారు 30 మందికిపైగా కార్డులకు బియ్యం పంపిణీ చేయలేదు. దీంతో కార్డుదారులు తమకు రావాల్సిన బియ్యం ఎక్కడ..? అంటూ రేషన్‌షాపు డీలర్‌ను నిలదీశారు. ఆపై షాపు ఎదుటే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం పంపిణీ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
6న బ్రహ్మోత్సవాలపై
ఉభయదారుల సమావేశం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈనెల 6వ తేదీన ఉభయదారులతో సమావేశం జరగనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని శ్రీమణికంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మధ్యాహ్నం 2గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఉభయదారులు పాల్గొన్నాలని ఆయన కోరారు.
తోతాపురి.. వద్దులే మరి!
యాదమరి: తోతాపురి రైతులు ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలేక నానాఅగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో తోతాపురిని వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు. తోటల్లోని తోతాపురి చెట్లను తెగనరికి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనే యాదమరి మండలంలో చోటు చేసుకుంది. మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య ఐదెకరాల్లో మామిడి పంటను సాగు చేశాడు. పదేళ్లపాటు కన్నబిడ్డల్లా పెంచాడు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన తోతాపురికి గిట్టుబాటు ధర వచ్చి తమకు రక్షణగా ఉంటుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. గుజ్జు పరిశ్రమలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేయడం.. దళారులు చెప్పిందే వేదంగా ఉండడంతో విసుగు చెందారు. ఎందుకొచ్చిన తంటలే అనుకుని తనకున్న ఐదెకరాల మామిడి తోటలో దాదాపు రెండు వందల తోతాపురి చెట్ల కొమ్మలను నరికేశాడు. ప్రత్యామ్నాయంగా దాని స్థానంలో వేరే రకాలను అంటు కట్టేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.