కోవిడ్‌పై భయం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కోవిడ్ వ్యాప్తికి ప్రజలు భయపడ్డొదని ..అలా అని అజాగ్రత్తగా ఉండకూడదని..తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని డీఎంఅండ్‌హెచ్ సుధారాణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారిపై దృష్టిపెడుతున్నామన్నారు. వారికి కోవిడ్ పరీక్షలు చేసేలా ఆదేశాలు వచ్చాయన్నారు. కొవిడ్ లక్షణాలుంటే.. ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలని ఆదేశాలుండాయన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులు చేరొద్దన్నారు. మాస్క్‌లు వాడడం మంచిదన్నారు. చేతుల శుభ్రత, భౌతికదూరం పాటించడం ఉత్తమన్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు ముందు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
కుస్తీ పోటీలకు ఎంపిక
యాదమరి : రాష్టస్థ్రాయి అండర్ 17 బాలబాలికల కుస్తీ పోటీలలో యాదమరి ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడాకారిణి జీవనగీత ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు చిత్తూరు మేసానికల్ క్రీడా మైదానంలో జరిగిన కుస్తీ పోటీలలో వివిధ రాష్ట్రాల క్రీడాకారిణిలతో పోటీ పడి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు చండీఘర్‌లో జరగనున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధించడంతో క్రీడాకారిణి జీవనగీత మన రాష్ట్రం తరఫున ఆడనుంది. ఈ సందర్భంగా జీవనగీతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిరాజా, పీడీలు రవి, హరికృష్ణ, దాము , ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లా అభివృద్ధిపై సీఎంకు 27 ప్రతిపాదనలు
● టీడీపీ జిల్లా మహానాడులో నేతల తీర్మానం
చిత్తూరు అర్బన్ : చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి 27 అంశాలతో కూడిన ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచనున్నట్లు టీడీపీ నాయకులు తీర్మానించారు. గురువారం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా మహానాడును అధ్యక్షుడు సిఆర్.రాజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళుతోందన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేస్తామన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. విజయపురంలోని కోసల నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్ నాయుడు, కలికిరి మురళీమోహన్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, పరిశీలకులు మారుతి చౌదరి, సునీల్‌కుమార్, టీడీపీ నేతలు దొరబాబు, మనోహన్, చంద్రప్రకాష్, సురేంద్రకుమార్, హేమలత, త్యాగరాజన్, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.


