పేదింటి ఆణిముత్యాలకు పురస్కారాలు
పలమనేరు : వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబ.. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైవ్‌స్టాక్ మేనేజ్‌మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో 1000/971 మార్కులను సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది. ప్రభుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్‌లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్‌స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై ంది. ఆ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి అవార్డు అందుకుంది. హర్షిత పదో తరగతి దాకా వలసపల్లి నవోదయ పాఠశాలలో చదివింది. హర్షితతో పాటు చెల్లి శ్రావణి సైతం ఇదే కోర్సు చదివింది. మొన్నటి ఫలితాల్లో శ్రావణి 900 పైగా మార్కులను సాధించింది. వీరి తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
కేజీబీవీ విద్యార్థినికి మంత్రి అభినందన
రొంపిచెర్ల : కేజీబీవీ విద్యార్థిని శ్రావంతిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థిని శ్రావంతి సీఈసీలో 935 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోని కేజీబీవీల్లో మొదటి స్థానంలో నిలి చారు. కర్నూల్ జిల్లాకు చెందిన శివన్న, దేవమ్మకు ఇద్దరు కుమారైలు..వీరిలో పెద్ద కుమారై శ్రావంతి రొంపిచెర్ల కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. రెండో కుమారై దీక్షా 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తిరుపతిలో మేస్త్రి పని చేసుకుని పిల్లలను చదివిస్తున్నారు. కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 26 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు సాధించారు. మంగళవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థిని శ్రావంతికి ల్యాప్ టాప్‌ను ప్రదానం చేశారు. అలాగే వందశాతం ఫలితాలు సాధించిన కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపల్ సుజాత, అధ్యాపకులను మంత్రి అభినందించారు.
పేదింటి ఆణిముత్యాలకు పురస్కారాలు


