
ప్రచారం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
పెనుమూరు(కార్వేటినగరం) : రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ఆయన శనివారం ఎర్రమట్టిపల్లి దళితవాడ, ఎర్రమట్టిపల్లి గ్రామం, చిన్నమిట్టూరు, చిరుతగుంట, విడిదిపల్లి, విడిదిపల్లి దళితవాడ, ఎన్టీఆర్ కాలనీ, తాటిమాకులపల్లి, అత్తిమాకులపల్లిలో ప్రచారం చేశారు. ఆయనకు అడుగు అడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సంక్షేమానికి చిరునామా అని, చంద్రబాబు పాలన అవినీతికి కేరాఫ్ అని న్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా అమలుచేశారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తన కొడుకు లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చుకున్నాడని దుయ్యబట్టారు. తన పరిపాలన అంతా దోచుకో.. దాచుకో అన్నట్టు సాగిందని విమర్శించారు. ఇప్పుడు అవినీతి, దోపిడీదారులంతా కలిసి కూటమిగా వస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు డబ్బు ఎర వేసి ఓట్లు పొందేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. పొరపాటున ఆయనకు ఓటు వేస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని పేర్కొన్నారు.
కరువుకు కేరాఫ్ చంద్రబాబు
రాష్ట్ర విదేశీ వ్యవహారాల సలహాదారు మహా సముద్రం జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఏనాడూ సక్రమంగా వర్షాలు కురవలేదన్నారు. పంటలు పండక, గిట్టుబాటు ధరలేక రైతులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ప్రజల వద్దకే పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని కూటమిలతో కలిసి వచ్చినా ప్రజల ఆశీర్వాదం జగనన్నకు మెండుగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమలతారెడ్డి, మండల కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్ సురేష్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి కమలాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ దొరస్వామియాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు దూదిమోహన్, ఎంపీటీసీ శివలింగం, మాజీ సర్పంచ్ చెంగల్రాయులు, మాజీ ఎంపీటీసీ గురుమూర్తి, జేసీఎస్ కన్వీనర్ హరికృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగనన్న పరిపాలన సాగించినట్టు వివరించారు. మంచి చేసినందునే ‘మీకు మేలు జరిగి ఉంటేనే మాకు మళ్లీ ఓట్లు వేయండి’ అని తమ నాయకుడు ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. సీఎం జగనన్న బాటలోనే పేదలకు సేవ చేసేందుకు తన బిడ్డ కృపాలక్ష్మి పోటీ చేస్తోందన్నారు. చేసిన మంచిని గుర్తు పెట్టుకుని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను గెలిపించాలని కోరారు.