
ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్న డీవీఈఓ సయ్యద్ మౌలా.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జూనియర్ ఇంటర్‌లో 50 శాతం, సీనియర్ ఇంటర్‌లో 63 శాతం ఉత్తీర్ణతను విద్యార్థులు సాధించారు.మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 26వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ప్రకటించారు. చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలోని డీవీఈఓ కార్యాలయంలో జిల్లా ఫలితాలను డీవీఈఓ సయ్యద్ మౌలా విడుదల చేశారు.
బాలికలదే హవా : ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలురకంటే బాలికలే ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 6,523 మంది బాలురకు గాను 2,719 మంది ఉత్తీరత సాధించారు. బాలికలు 6,701 మందికి గాను 3,847 మంది ఉత్తీర్ణత పొందారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలకు 5,297 మంది బాలురకు గాను 2,997 మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 5,585 మందికి గాను 3,820 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్‌లోనూ బాలికలే ముందంజలో నిలిచారు. ఒకేషనల్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో చదువుతున్న బాలికలు బాలుర కంటే అధిక శాతం ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో కేజీబీవీ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 218 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 154 మంది ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 183 మందికి గాను 158 మంది ఉత్తీర్ణత చెందారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణారెడ్డి అభినందనలు తెలిపారు.