
లింక్డ్‌ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025 జాబితాలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం జెప్టో అగ్రస్థానంలో నిల్చింది. జెప్టో నంబర్ వన్ స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడో ఏడాది. తర్వాత స్థానంలో ఎంటర్‌ప్రైజ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ, 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విష్ మూడో స్థానంలో నిల్చాయి. హైదరాబాదీ స్టార్టప్ సంస్థ భాంజూ ఏడో ర్యాంకు దక్కించుకుంది.
ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగంపై ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించగలిగే సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికన లింక్డిన్ ఈ జాబితాను రూపొందించింది. ప్రారంభించి అయిదేళ్లు మించకుండా, భారత్‌లో ప్రధాన కార్యాలయం, కనీసం 30 మంది ఉద్యోగులు కలిగి ఉండి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న సంస్థలను దీని కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2024 జూలై 2 నుంచి 2025 జూన్ 30 వరకు డేటా ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. వివిధ కేటగిరీలలో కార్యకలాపాలు సాగిస్తున్న టాప్ మూడు సంస్థలు వేగంగా వృద్ధి చెందుతూ, కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తున్నాయని లింక్డిన్ తెలిపింది. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు క్విక్ కామర్స్, ఏఐ-నేటివ్ ప్లాట్‌ఫాంలు, స్పెషలైజ్డ్ ఫిన్‌టెక్ సంస్థలు కీలక చోదకాలుగా నిలుస్తున్న తీరు జాబితాతో వెల్లడైంది.
లిస్టు ప్రకారం..
- వీక్‌డే (4వ ర్యాంకు), కాన్విన్ (6), లైమ్‌చాట్ (19) తదితర ఏఐ స్టార్టప్‌లు.. జార్ (5వ స్థానం), కార్డ్91 (18), డెజర్వ్ (16) ఫిన్‌టెక్ సంస్థలు టాప్ 20 జాబితాలో నిల్చాయి.
- టాప్ 20లో తొమ్మిది స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తూ అంకురాల రాజధానిగా బెంగళూరు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జెప్టో, స్విష్, లూసిడిటిలాంటి సంస్థలు నగరం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
- ఢిల్లీ, ముంబై నుంచి రెండు చొప్పున లిస్టులో చోటు దక్కించుకున్నాయి. పుణెకి చెందిన ఈమోటోర్యాడ్ 9వ ర్యాంకులో నిలిచింది.