ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్‌పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.
అసలేం ఏం జరుగుతోంది?
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్‌ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.
సందేశం వస్తే ఏం చేయాలి?
మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్‌లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్‌లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?
సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.
భవిష్యత్తు ప్రణాళిక
ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్‌తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.
ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన


