మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన | Bollywood Actress Sonali Kulkarni Stuck 5 Hours In Mumbai Pune Traffic Jam, Raises Concern Over Mankhurd Bridge Gridlock | Sakshi
Sakshi News home page

మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన

May 2 2026 7:57 AM | Updated on May 2 2026 11:38 AM

Bollywood Actress Sonali Kulkarni Stuck 5 Hours Mumbai Pune Traffic Jam

మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు సామాన్యులకు నిత్యకృత్యం కావచ్చు. కానీ, ఐదు గంటల పాటు వాహనాల మధ్య చిక్కుకుపోవడం అంటే అంటే మాటలు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి తాజాగా అలాంటి భయంకరమైన అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ముంబై నుంచి పుణె వెళ్తుండగా మన్ఖుర్ద్ వంతెనపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆమె తన నిస్సహాయతను, ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

పూర్తిగా చిక్కుకుపోయాం..

సోనాలి కులకర్ణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె తన ముందు, వెనుక ఆగిపోయిన వందలాది వాహనాలను చూపిస్తూ పరిస్థితి తీవ్రతను వివరించారు. ‘మేము ఇక్కడ మన్ఖుర్ద్ వంతెనపై ఉన్నాం. మేము ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి సరిగ్గా ఐదు గంటలు అయింది. కదలడానికి వీలులేని పరిస్థితి. వెనక్కి వెళ్దామంటే అదీ సాధ్యం కాదు. దయచేసి మా కోసం ప్రార్థించండి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంపై అసహనం

ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించినప్పుడు తమకు ఎదురైన అనుభవాన్ని కూడా సోనాలి బయటపెట్టారు. ‘మేము సహాయం కోసం ట్రాఫిక్ అధికారులను ఫోన్ చేసి అడిగాం. వారు ఓపిక పట్టండి అని మాత్రమే చెబుతున్నారు. అసలు ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ముందు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. కనీసం పోలీసులు పరిస్థితిని అంచనా వేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం లేదా మాకు కనీసం సమాచారం అందించడం వంటివి చేస్తే బాగుంటుంది’ అని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు.

నెటిజన్ల స్పందన

సోనాలి షేర్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఆమె అనుభవంతో ఏకీభవిస్తున్న నెటిజన్లు నగరాల్లో ట్రాఫిక్ వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము కూడా అదే సమయంలో రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం’, ‘విపత్తు నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు’, ‘ప్రణాళికా లోపం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు’ అంటూ పలువురు నెటిజన్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement