భారత్‌వైపు టెక్‌ కంపెనీల చూపు.. | West Asia Crisis Pushes Global Tech Giants To Eye India As Emerging Data Center Hub, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌వైపు టెక్‌ కంపెనీల చూపు..

Apr 7 2026 11:59 AM | Updated on Apr 7 2026 1:46 PM

West Asia Turmoil Accelerates India Rise as Global Data Center Hub

యుద్ధం నేపథ్యంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై నజర్‌

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళికంగా, ఆర్థికంగా సురక్షితమైన స్థావరంగా భావిస్తున్న భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది.

గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌), మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌ ఇప్పటికే దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లయిన CtrlS, Sify, NTT, CapitaLand, Airtel Nxtraలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమాసియా క్లయింట్లు సైతం తమ డేటాను భారత్‌కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

భారత్ ఎందుకు అత్యుత్తమ ఎంపిక?

అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ వర్క్‌లోడ్‌ను యూరప్ లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ధరల ప్రయోజనం. నిపుణులు విశ్లేషణ ప్రకారం, భారత్‌లో ఒక డేటా సెంటర్ నిర్మించే ఖర్చుతో పోలిస్తే సింగపూర్‌ వంటి దేశాల్లో రెండింతలు ఖర్చవుతుంది. అంటే భారత్‌లో పెట్టుబడి పెడితే మిగిలిన సొమ్ముతో మరో అదనపు కేంద్రాన్ని ఉచితంగా నిర్మించుకున్నంత లాభం చేకూరుతుంది.

జీపీయూలకు భారీ డిమాండ్

కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ప్రాసెసింగ్‌కు అవసరమైన జీపీయూ(గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు) కోసం కూడా అంతర్జాతీయ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘యొట్టా’ డేటా సర్వీసెస్ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలతో 16 మిలియన్‌ డాలర్ల నుంచి 1.3 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ జీపీయూ ఒప్పందాలను కుదుర్చుకుంది. పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి రాబోయే నాలుగు నెలల్లో సుమారు 30,000 అదనపు B300/B200 జీపీయూలను సిద్ధం చేయాలని యొట్టా భావిస్తోంది.

సాధారణ కార్యాలయాల వలె డేటా సెంటర్లను తక్షణమే మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు దీర్ఘకాలికంగా భారత్‌కు మేలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, గల్ఫ్ దేశాల్లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిస్క్.. భారత్‌ను గ్లోబల్ క్లౌడ్ కారిడార్‌లో ఒక శక్తివంతమైన సెకండరీ హబ్‌గా నిలబెడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్లోబల్ టెక్ రంగంలో ఇదొక నిర్మాణాత్మక మార్పు. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డిజిటల్ ఎకానమీలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.

ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Advertisement
 
Advertisement
Advertisement