వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే! | Warren Buffett’s Proven Formula for Investing with Little Money | Sakshi
Sakshi News home page

వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!

Apr 20 2026 6:04 PM | Updated on Apr 20 2026 6:18 PM

Warren Buffett’s Proven Formula for Investing with Little Money

పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.

చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండి
చాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.

ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధం
ఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్‌లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.

తెలివితేటలే అసలైన పెట్టుబడి
తెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు  కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.

కాంపౌండింగ్ మాయాజాలం
బఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.

కేవలం ఎఫ్‌డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement