US Visa: మరింత తొందరగా అమెరికన్‌ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!

US Reduces Visa Delays In India - Sakshi

వీసాల జారీలో భారతీయులకు అమెరికా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్‌కు ముందు కంటే ఈ ఏడాది ఇ‍ప్పటి వరకు 36 శాతం అధికంగా భారతీయులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా తెలిపింది. కోవిడ్‌ తర్వాత భారతీయులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో వారికి వీసాల కోసం వేచిచూసే సమయం చాలా తగ్గిపోయిందని పేర్కొంది.

ముఖ్యంగా మొదటిసారి వచ్చే వారికి వీసా కోసం వేచిచూసే సమయం 1000 రోజుల నుంచి 580 రోజులకు తగ్గిపోయింది. తరచూ వచ్చే వారికి ఇంటర్వ్యూ ప్రక్రియను మినిహాయించడం, కాన్సులర్‌ విధుల్లో అదనపు సిబ్బందిని నియమించడం, సూపర్‌ సాటర్‌డే వంటి చర్యలు ఇందుకు మేలు చేశాయి. అంతేకాకుండా వచ్చే వేసవి నుంచి కొన్ని కేటగిరీల్లో స్టేట్‌సైడ్‌ వీసాల రెన్యూవల్‌ను పైలట్‌ విధానంలో అమలు చేయనున్నట్లు అమెరికా పేర్కొంది.

వీసాల జారీలో భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా కాన్సులర్‌ ఆపరేషన్స్‌ విభాగం సీనియర్‌ అధికారి జూలీ స్టఫ్‌ తెలిపారు. వీసాల జారీలో జాప్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితిని మార్చడానికి తాము పట్టుదలతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన పలు చర్యలతో కోవిడ్‌కు ముందు కంటే ఇ‍ప్పుడు 36 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కోవిడ్‌ కాలంలో అమెరికా ప్రపంచవ్యాప్తంగా తమ కాన్సులర్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడంతో వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో భారత్‌లో అధిక సంఖ్యలో వీసా దరఖాస్తులు పేరుకుపోయాయి. టూరిస్టులకు ఇచ్చే బీ1, బీ2 వీసాలతో పాటు హెచ్1బీ, ఎల్‌ వర్క్‌ వీసాలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన ద్వైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. వీసాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

(ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్‌, మెసేజ్‌లు!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top