
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్‌లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్‌పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టింది.
తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్‌లో ఈ రోడ్ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్ కమిషనర్ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు.