
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత నెలలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కంపెనీ తీసుకున్న నిర్ణయంపై సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) మద్దతుతో యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ (యూఐటీఈ) ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.
టీసీఎస్ కంపెనీ మిడ్ లెవల్, సీనియర్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లేఆఫ్స్ కంపెనీ అవసరానికి బదులు లాభాపేక్షతోనే జరుగుతున్నట్లు యూఐటీఈ చెబుతోంది. సీనియర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అక్రమ తొలగింపులను ప్రోత్సహించడం ఉద్యోగ భద్రతపై దాడిగా అభివర్ణిస్తుంది. ఈమేరకు చెన్నైలోని టీసీఎస్ కార్యాలయం ముందు ఉద్యోగులు, కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన చేశాయి. ఉద్యోగాల తొలగింపును ఆపడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: జీవిత బీమాపై ఈ అపోహలొద్దు..
టీసీఎస్ ఈ లేఆఫ్స్ వ్యవహారంపై స్పందిస్తూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయాణంలో భాగంగా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తప్పవని చెప్పింది. ఇది కంపెనీలోని శ్రామిక శక్తిలో సుమారు 2 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. క్లయింట్ల సర్వీస్ డెలివరీపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సంస్థను వీడుతున్న ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు, అవుట్ ప్లేస్‌మెంట్, కౌన్సిలింగ్, సపోర్ట్ అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.