Jay Chaudhry: నాడు కాలినడక.. నేడు అపరకుబేరుడు!

From Under Tree Studies Jay Chaudhry Now Became Billionaire In Us - Sakshi

‘‘ఈజీ మనీని క్వాలిటీ లెస్‌ సర్వీసులతో.. ఎంత త్వరగా సంపాదిస్తారో.. అంతే త్వరగా పొగొట్టుకుంటారు కూడా.  అందుకే డబ్బు తక్కువొచ్చినా సరే క్వాలిటీగా అందించడం తన ఉద్దేశమ’’ని తరచూ చెప్తుంటారు జే చౌద్రి.  అమెరికాలో టాప్‌ క్లౌడ్‌ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అయిన జీస్కేలర్‌ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉన్న జే చౌద్రి.. తాజా ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి పడ్డ కష్టాల్ని మనసారా గుర్తు చేసుకుంటారాయన. 

జీస్కేలర్‌ అధినేత.. జే చౌద్రి. పుట్టిపెరిగింది హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో. అమెరికాలో జీస్కేలర్‌ కంపెనీ ద్వారా బిలియనీర్‌గా ఎదిగారాయన.  62 ఏళ్ల ఈ పెద్దాయన సంపద విలువ ఇప్పుడు ఒక లక్షా 21 వేల 600 కోట్ల రూపాయలు. గత ఏడాదిగా ఒక్కోరోజుకి సంపాదిస్తోంది అక్షరాల 153 కోట్ల రూపాయలు. అందుకే ఐఐఎఫ్‌ఎల్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో నిలిచారు.  అయితే ఆయన పుట్టుక నుంచి ఎదిగే క్రమం మొత్తం దాదాపుగా పేదరికంలోనే నడిచింది. 

నడకే నేర్పింది
హిమాచల్‌ప్రదేశ్‌ ఉనా జిల్లా పనోహ్‌లో చౌద్రీ పుట్టిపెరిగారు జే చౌద్రీ(1958లో). ఆనాటి పరిస్థితులకు తగ్గట్లే ఆయన బాల్యం గడిచింది.  స్కూల్‌ టైంలో తోటి పిల్లలంతా సైకిళ్ల మీద వెళ్తుంటే.. పేద రైతు కుటుంబంలో పుట్టిన చౌద్రీ మాత్రం నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లేవారు.  ఇక చౌద్రీ బీటెక్‌ చదివేదాకా ఆయన ఇంటికి మంచి నీరు, కరెంట్‌ సౌకర్యాలు కూడా లేవట.  

చెట్ల కింద చదువులతో స్కూల్‌ విద్య పూర్తి చేసిన చౌద్రీని.. మంచి చదువులు చదివించాలని ఆయన తల్లి ఆశపడింది. అందుకే పుస్తెలమ్మి కొడుకును చదివించింది. ఆ తల్లి ఆశలు ఫలించి ఫ్లస్‌టూ స్థాయి చదువుల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు ఆ కుర్రాడు. అందరిలా డిగ్రీ కాకుండా.. ఇంజినీరింగ్‌ చదవమని ఓ లెక్చరర్‌ ప్రొత్సహించాడు.  దీంతో వారణాసి ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారాయన. పనోహ్‌ నుంచి ఈ ఘనత దక్కించుకున్న తొలి విద్యార్థి కూడా చౌద్రీనే. ఆపై స్కాలర్‌షిప్‌ ద్వారా పైచదువులకు అమెరికా వెళ్లారు. 

భార్య సపోర్ట్‌తో..
ఎంబీఏ, ఎమ్మెస్‌ తర్వాత తొలుత కొన్ని కంపెనీల్లో పని చేసిన చౌద్రీ.. ఆ తర్వాత రాజీనామా చేసి భార్య జ్యోతి సహకారంతో వరుసగా కంపెనీలు పెట్టడం, వాటిని లాభాలకు పెద్దకంపెనీలకు అమ్మేస్తూ వచ్చారు.  1997లో సెక్యూర్‌ఐటీ, చిపర్‌ట్రస్ట్‌ కంపెనీలను నెలకొల్పారు. వాటిని సెక్యూర్‌ కంప్యూటింగ​ కార్పొరేషన్‌కు అమ్మేసి, ఆపై ఎయిర్‌డిఫెన్స్‌ను స్థాపించారు. కొన్నాళ్లకు ఈ కంపెనీని కూడా మోటరోలాకు అమ్మేశారు. ఆపై కోర్‌హార్బర్‌(ఏటీ అండ్‌ టీ కొనుగోలు చేసింది), సెక్యూర్‌ఐటీ(వరిసైన్‌ కొనేసింది) కంపెనీలను నెలకొల్పారు. చివరికి జయ్‌చౌదరి 2007లో కాలిఫోర్నియా శాన్‌జోన్స్‌ బేస్‌గా ‘జీస్కేలర్‌’ క్లౌడ్‌బేస్డ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కంపెనీని స్థాపించారు. 2018లో ఐపీవో ద్వారా 192 మిలియన్‌ డాలర్లను పోగేశారు. ఏడాది తిరగకుండానే రెట్టింపు ఆదాయం, ఆ మరుసటి ఏడాదికి జే చౌద్రీని ఫోర్బ్స్‌ బిలియనీర్‌గా నిలబెట్టింది జీస్కేలర్‌. 


185 దేశాలు, 150కిపైగా డేటా సెంటర్లు.. పదివేలకు తగ్గని ఉద్యోగులకు బాస్‌గా ఉన్నారు జే చౌద్రీ.  కార్బొరేట్‌ కంపెనీలపై జరిగిన సైబర్‌ దాడులు, జీస్కేలర్‌ క్లౌడ్‌ సర్వీసు వినియోగం పెరగడానికి కారణంకాగా.. ఈ ప్రభావంతో  చౌద్రీ సంపద ఏకంగా 85 శాతం పెరిగింది.  

పేరెంట్స్‌ రుణం వెలకట్టలేనిది.. 
జీస్కేలర్‌లో 45 శాతం వాటా జే చౌద్రికి ఉంది. ఇప్పడాయన ఇండియన్‌-అమెరికన్‌ ఎంట్రప్రెన్యూర్‌. బిలియనీర్‌. అయినప్పటికీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చిన్నపిల్లాడైపోతాడు. విమానం ఎక్కాలన్న తల్లి కోరికను, తండ్రి చిన్నచిన్న సరదాలను తీర్చిన చౌద్రీ.. పక్కా ఫ్యామిలీమ్యాన్‌. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, భారత రాజకీయాలపై అధ్యయనం చేస్తుంటారు.  కఠోర శ్రమ, ధైర్యంగా ముందడుగు వేయడం, అదృష్టం..  ఈ మూడు తన సక్సస్‌కి కారణాలని చెప్పే చౌద్రి.. చేసే పని ఏదైనా సరే నిజాయితీ, కచ్చితత్వం ఉండాలంటూ యువతకు పిలుపు ఇస్తుంటారు.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top