
నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్‌లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్‌ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
భారీ టారిఫ్‌ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.
ప్రాథమికంగా టారిఫ్‌లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్‌ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్‌టైల్స్ రంగానికి టారిఫ్‌లు పెను సవాలుగా మారతాయని టెక్స్‌టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది.