ట్రంప్‌ వ్యాఖ్యలు వైరల్‌! ప్రత్యర్థులకు ఫుల్‌ జోష్‌ | Trump Says I Love Inflation Soaring Prices Crush Americans, Sparks Political Debate As US Prices Hit 3 Year High | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వ్యాఖ్యలు వైరల్‌! ప్రత్యర్థులకు ఫుల్‌ జోష్‌

Jun 11 2026 8:53 AM | Updated on Jun 11 2026 9:06 AM

Trump Says I Love Inflation Soaring Prices Crush Americans

అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్‌లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.

డెమొక్రాట్ల ఎదురుదాడి

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్‌ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్‌నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

డెమొక్రాటిక్ పార్టీ వ్యూహం

ట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.

మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం

తాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

ధరల పెరుగుదలకు కారణం

కొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.

ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఆశాజనకమైన సంకేతాలు

కొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ 
కాథీ బోస్ట్‌జోన్సిక్‌ అన్నారు.

వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.

ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

Advertisement
 
Advertisement
Advertisement