లాభాల్లో విప్రో రికార్డు.. ఈసారి ఫ్రెషర్లకు భారీ ఛాన్స్‌

Tech Giant Wipro Q 4 Results - Sakshi

విప్రో లాభం రూ. 3,093 కోట్లు 

క్యూ4లో ఆదాయం 28 శాతం ప్లస్‌ 

1–3% మధ్య ఆదాయ అంచనాలు 

ఈ డాది 38,000 ఫ్రెషర్స్‌కు చాన్స్‌   

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 3,093 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,974 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 28 శాతం జంప్‌చేసి రూ. 20,860 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 16,245 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఈ ఏడాది(2022–23) తొలి క్వార్టర్‌లో 1–3 శాతం వృద్ధిని ఆశిస్తోంది. వెరసి ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 274.8–280.3 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు(గైడెన్స్‌) ప్రకటించింది. పూర్తి ఏడాదికి 16–18 శాతం పురోగతికి వీలున్నట్లు అభిప్రాయపడింది. 

గతేడాది భళా 
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం దాదాపు 13 శాతం ఎగసి రూ. 12,233 కోట్లను తాకింది. 2020–21లో రూ. 10,866 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 28% జంప్‌చేసి రూ. 79,747 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది రూ. 62,234 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గతేడాది ఆదాయం10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ముగించడం విశేషమని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. తొలిసారి 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అందుకున్నట్లు వెల్లడించారు. వార్షిక ప్రాతిపదికన పరిశ్రమలోనే అత్యధికంగా 27% వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. తాజా క్యూ4 లో వరుసగా ఆరో క్వార్టర్‌లోనూ పటిష్ట ఆదాయ వృద్ధి(3%)ని అందుకున్నట్లు తెలియజేశారు.  

రికార్డు లాభం
గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 1.6 బిలియన్‌ డాలర్ల నికర లాభం సాధించినట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ పేర్కొన్నారు. క్లయింట్లపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా 10 కోట్ల డాలర్ల విభాగంలో 8 కొత్త కస్టమర్లను జత చేసుకున్నట్లు వెల్లడించా రు. 17.7% నిర్వహణ మార్జిన్లు సాధించినట్లు తెలియజేశారు. క్యాప్‌కో కొనుగోలుతో రెండంకెల వృద్ధిని అందుకుంటున్నట్లు డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. క్యూ4లో కొత్తగా 10 కోట్ల డాలర్ల విభాగంలో ఇద్దరు, 5 కోట్ల డాలర్లలో ముగ్గురు క్లయింట్లను గెలుచుకున్నట్లు తెలియజేశారు. 

ఇతర హైలైట్స్‌ 
- పోటీ సంస్థల బాటలోనే విప్రోలోనూ ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 23.8%గా నమోదైంది. అయితే త్రైమాసికం వారీగా 5% తగ్గింది. 
- గతేడాది 19,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలిచ్చింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా మొత్తం 45,416 మందిని జత చేసుకుంది.  
- ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 38,000 మందికి ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. 

చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top