దుమ్మురేపిన టాటా నెక్సాన్.. ఉత్పత్తిలో రికార్డు బద్దలు

Tata nexon achieves five lakh production milestone in six years - Sakshi

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా కార్లలో ఒకటి నెక్సాన్. దేశీయ మార్కెట్లో ఈ SUV విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు దీని కున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తికాదు. కంపెనీ ఇటీవల నెక్సాన్ ఉత్పత్తిలో ఐదు లక్షల మైలురాయిని చేరుకుంది.

2017 నుంచి సబ్-4-మీటర్ సెగ్మెంట్‌లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే విజయకేతనం ఎగురవేసింది. నిజానికి 2014 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టాటా నెక్సాన్ 2017లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది మొదట్లో ఏడు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లతో మొదలైంది.

'నెక్సాన్'లో మొదటి ఇంజిన్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ (109 హెచ్‌పి & 170 ఎన్ఎమ్ టార్క్) కాగా, రెండవది 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, డీజిల్ రెవోటార్క్ (109 హెచ్‌పి & 260 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభించాయి.

2020లో నెక్సాన్ మార్కెట్లో రీడిజైన్ మోడల్ విడుదలైంది. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మార్పులు జరిగాయి. ఆ తరువాత నెక్సాన్ ఈవీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. 2020లోనే కంపెనీ రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో నెక్సాన్ ఈవీ లాంచ్ చేసింది. ఇది 30.2 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ కాలంలోనే అత్యంత ఎక్కువ అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ సృష్టించింది.

ఇక టాటా మోటార్స్ 2022లో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ విడుదల చేసింది. ఇది దాని స్టాండర్డ్ నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా అప్డేట్ అయింది.ఈ అప్డేట్ మోడల్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 453 కిమీ పరిధిని అందిస్తుందని ARAI ద్వారా ధ్రువీకరించారు. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంది.

మొత్తానికి టాటా నెక్సాన్ తన ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను కంపెనీకి తీసుకురావడంలో సహాయపడింది. ఈ మధ్య కాలంలోనే కంపెనీ కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ డార్క్ ఎడిషన్, కజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్ వంటి అనేక స్పెషల్ అవతార్‌లలో కూడా విడుదల చేసి ఉత్పత్తిలో 5 లక్షల మైలురాయిని చేరుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top