జీఎస్‌టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే

Swiggy, Zomato are food delivery platforms as restaurants - Sakshi

రెస్టారెంట్ల కేటగిరీలోకి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌

ఐదు శాతం పన్ను భారం

కోవిడ్‌ ఔషధాలపై పన్ను రాయితీ గడువు పొడిగింపు

జీఎస్‌టీకి వెలుపలే పెట్రోల్, డీజిల్‌

జీఎస్‌టీ విధాన మండలి నిర్ణయం  

లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. 

ఇక  జొమాటో,  స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్‌టీ పన్ను విధించింది.  లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్‌టీ కౌన్సిల్‌ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్‌ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► కొన్ని కోవిడ్‌–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్‌ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్‌ 30తో ముగిసే మెడికల్‌ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు.  
► కేన్సర్‌ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు.
► బలవర్థకమైన బియ్యం విషయంలో  18 శాతం నుండి 5 శాతానికి జీఎస్‌టీ రేటు కోత.  
► బయో–డీజిల్‌ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు.
► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్‌ పరి్మట్‌ ఫీజు జీఎస్‌టీ నుంచి మినహాయింపు
► లీజ్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దిగుమతి ఐ–జీఎస్‌టీ చెల్లింపు మినహాయింపు.
► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్‌టీ.  
► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top