అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనతల ప్రభావం
సూచీల ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
మళ్లీ 26,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 278 పాయింట్లు కోల్పోయి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,910 వద్ద నిలిచింది. దీంతో స్టాక్ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడవుతూ... ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 393 పాయింట్లు పతనమై 84,558 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద కనిష్టాలు తాకాయి.
డిసెంబర్‌లో యూఎస్ ఫెడరల్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు రేకెత్తడంతో పాటు టెక్నాలజీ రంగంలో అధిక వాల్యుయేషన్ల ఆందోళలనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియాలో జపాన్ 3.33%, కొరియా 3.43%, తైవాన్ 2.58%, హాంగ్‌కాంగ్ 2%, సింగపూర్, చైనా 1% క్షీణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్ 1.7%, జర్మనీ 1.6%, బ్రిటన్ 1.3% నష్టపోయాయి.
⇒ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో తాజాగా పీఈ సంస్థ సయిఫ్ పార్ట్‌నర్స్ 1.86 శాతం వాటా విక్రయించింది. దీంతో పేటీఎమ్‌లో సయిఫ్ వాటా 15.33 శాతం నుంచి 13.47 శాతానికి తగ్గింది. షేరుకి రూ. 1,305 సగటు ధరలో రూ. 1,556 కోట్లకు అమ్మివేసింది. పేటీఎమ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3% పతనమై రూ. 1,293 వద్ద ముగిసింది.


