మార్కెట్‌కు బ్యాంకింగ్‌ షేర్ల దన్ను | Stock Market: Sensex Gains 167 Points; Nifty Ends Around 21,800 | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు బ్యాంకింగ్‌ షేర్ల దన్ను

Published Sat, Feb 10 2024 4:41 AM | Last Updated on Sat, Feb 10 2024 4:41 AM

Stock Market: Sensex Gains 167 Points; Nifty Ends Around 21,800 - Sakshi

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి బ్యాంకింగ్‌ షేర్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది.

ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్‌.. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్‌ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్‌..
క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్‌ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్ల పతనం కొనసాగుతోంది.

కంపెనీ షేరు బీఎస్‌ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్‌ వేల్యుయేషన్‌ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్‌97కి అసోసియేట్‌ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకును ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని విశేషాలు..
► బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1.36 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ 1.97 శాతం, మెటల్‌ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్‌ 1.45 శాతం, విద్యుత్‌ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, కన్జూమర్‌ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు లాభపడ్డాయి.  
► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు.  
► వారంవారీగా చూస్తే సెన్సెక్స్‌ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి.  
► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్‌ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement