
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది.