25,600 స్థాయి దిగువకు నిఫ్టీ
ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ మార్కెట్ రెండు వారాల కనిష్టానికి దిగివచ్చింది. ఐటీ, మెటల్, వినిమయ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 83,459 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25,598 వద్ద నిలిచింది. సూచీలు ఉదయం లాభాలతో మొదలైనప్పటికీ.., అదే జోరును రోజంతా కొనసాగించలేకపోయాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 83,413 వద్ద, నిఫ్టీ 185 పాయింట్లు పతనమై 25,578 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఆసియాలో దక్షిణ కొరియా, జపాన్, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు 1% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్‌ఈలో రంగాల ఇండెక్సుల్లో యుటిలిటీస్ 1.56%, మెటల్ 1.40%, కమోడిటీస్ 1.11%, ఐటీ 1.06%, విద్యుత్ 0.99%, రియల్టీ 0.83% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.69%, 0.26 శాతం నష్టపోయాయి.
⇒ టైటాన్ షేరు 2% లాభపడి రూ.3,813 వద్ద స్థిరపడింది. క్యూ2లో కంపెనీ లాభం 59% వృద్ధితో షేరుకు కొనుగోలు మద్దతు లభించింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే.
⇒ క్యూ2లో నికరలాభం రెట్టింపుతో ఎయిర్‌టెల్ షేరు 2% పెరిగి రూ.2,113 వద్ద స్థిరపడింది.
నేడు మార్కెట్లకు సెలవు
గురునానక్ జయంతి సందర్భంగా నేడు దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. కమోడిటీ మార్కెట్లు సాయంత్రం నుంచి పనిచేస్తాయి.


