Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు

Stock Market: Analysts expect volatility to continue in the coming week - Sakshi

ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ, కార్పొరేట్‌ ఫలితాలు కీలకం 

అదానీ గ్రూప్‌ –హిండెన్‌బర్గ్‌ పరిణామాలపై దృష్టి

ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాపైనా దృష్టి

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ – అదానీ గ్రూప్‌ పరిణామాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్‌ ఇండెక్స్‌ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి.

ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్‌ బర్గ్‌ నివేదిక, అదానీ గ్రూప్‌ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్‌ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది.

‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్‌ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్‌ సంక్షోభం పరిణామాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ అడ్వైజరీ ఇన్వెస్టర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ అపూర్వ సేత్‌ తెలిపారు.  

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్‌ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్‌– బ్యాంక్‌ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్‌ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ కన్‌స్ట్రక్షన్‌ పీఎంఐ డేటా, బ్రిటన్‌ సీఐపీఎస్‌ కన్‌స్ట్రక్షన్‌ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్‌ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది.  ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు.  

ఆర్‌బీఐ ఎంసీపీ సమావేశం
ఆర్‌బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్‌బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్‌ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్‌లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ ఛైర్మన్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది.

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు  
ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్‌ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు.  గతేడాది జూన్‌ తర్వాత ఒక నెలలో ఎఫ్‌ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్‌ఐఐలు భారత్‌ మార్కెట్‌లో షార్ట్‌ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్‌ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్‌ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్‌ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహకర్త వీకే విజయ్‌ కుమార్‌ తెలిపారు.   

కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు  
దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్‌ఎం, ఎల్‌ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top