
48 బిలియన్ డాలర్ల మేర ప్రభావం
టెక్స్‌టైల్స్, రత్నాభరణాలపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్‌పోర్ట్స్‌పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి.
టెక్స్‌టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్‌వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు.
ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్‌లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది.
ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు..
ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్‌లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్‌ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..
టారిఫ్‌ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.