చిన్న ప్యాకెట్‌.. సూపర్‌హిట్‌!

Smaller packs, value brands in focus as consumers battle higher prices - Sakshi

తక్కువ రేట్ల ప్యాక్‌లపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రత్యేక దృష్టి

ధర పెంచకుండా, ఉత్పత్తుల పరిమాణం తగ్గింపు

ముడిసరుకుల ధరల భారాన్ని ఎదుర్కొనేందుకే

డాబర్‌ ఇండియా, పార్లే తదితర సంస్థల వ్యూహాలు

న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి.

తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్‌ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్‌ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్‌ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్‌ డిజిట్‌ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి.  

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ.

వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్‌ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి.  

మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్‌..
గతేడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్‌లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం బిజోమ్‌ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్‌ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది.

అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అబనీష్‌ రాయ్‌ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్‌ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్‌యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్‌ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top