ఆర్డర్లే ఆర్డర్లు- ఈ షేర్లకు భలే జోష్‌

Shares that jumps on bagging water project contracts - Sakshi

పలు కంపెనీలకు లభిస్తున్నవిభిన్న ఆర్డర్లు

భారీ లాభాలతో ట్రేడవుతున్నషేర్లు

జాబితాలో ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌

ఇండియన్‌ హ్యూమ్‌పైప్స్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎస్‌పీఎంఎల్‌ ఇన్‌ఫ్రా

ముంబై, సాక్షి: ఒక్కరోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 234 పాయింట్లు ఎగసి 46,194 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు ఎగసి 13,546కు చేరింది. వెరసి మార్కెట్లు మళ్లీ రికార్డుల ర్యాలీ బాట పట్టాయి. కాగా.. ఆర్థిక రికవరీ పరిస్థితులు నెలకొనడంతో పలు కంపెనీలు ఆర్డర్లు, కాంట్రాక్టులను దక్కించుకుంటున్నాయి. తాజాగా ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌, ఇండియన్‌ హ్యూమ్‌పైప్స్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎస్‌పీఎంఎల్‌ ఇన్‌ఫ్రా ఈ జాబితాలో చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. (డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్‌.. హాట్‌హాట్‌)

ఆర్డర్ల బాటలో
రైల్వే రంగ పీఎస్‌యూ.. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌కు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి రూ. 900 కోట్ల విలువైన కాంట్రాక్టు  లభించింది. దీనిలో భాగంగా గుర్గావ్‌- పటౌడీ- రేవారీ సెక్షన్‌లో అప్‌గ్రేడ్‌ పనులు చేపట్టవలసి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇర్కాన్‌ షేరు ఎన్‌ఎస్ఈలో 5.6 శాతం జంప్‌చేసి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96కు చేరింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ రూ. 550 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది. 21 నెలలో పూర్తిచేయవలసిన ఆర్డర్‌లో భాగంగా కాన్పూర్‌ డివిజన్‌లోని 550 గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియన్‌ హ్యూమ్‌ పైప్స్‌ షేరు 6 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. (ర్యాలీ షురూ‌- 46,000 ఎగువకు సెన్సెక్స్‌)

అప్పర్‌ సర్క్యూట్‌
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా పథకాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు రూ. 1,332 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు గాయత్రి ప్రాజెక్ట్స్‌ తెలియజేసింది. భాగస్వామ్య సంస్థ ద్వారా సాధించిన ఈ ప్రాజెక్టులో 97.5 శాతం వాటా తమకున్నట్లు వెల్లడించింది. దీంతో్ గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 36.35 వద్ద ఫ్రీజయ్యింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య సంస్థ ద్వారా పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, ఎస్‌పీఎంఎల్‌ ఇన్‌ఫ్రా రూ. 952 కోట్ల విలువైన కాంట్రాక్టును సొంతం చేసుకున్నాయి. నమామీ గంగే, గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాలలో భాగంగా 952 గ్రామాలకు 10ఏళ్లపాటు నీటి సరఫరా సంబంధ పనులను నిర్వహించవలసి ఉన్నట్లు జేవీ తెలియజేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎస్‌పీఎంఎల్‌ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 13.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇక పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ 3.5 శాతం పెరిగి రూ. 182 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ జంప్‌చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top