కారు తెచ్చిన చిక్కులు.. షారుఖ్‌, దీపికలపై కేసులు | FIR Filed Against Shah Rukh Khan, Deepika Padukone Over Hyundai Alcazar Complaint in Rajasthan | Sakshi
Sakshi News home page

కారు తెచ్చిన చిక్కులు.. షారుఖ్‌, దీపికలపై కేసులు

Aug 27 2025 7:55 PM | Updated on Aug 27 2025 9:13 PM

Shah Rukh Khan Deepika Padukone Face FIR Over Faulty Hyundai Car

బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ ఖాన్‌, దీపిక పదుకొణెలకు చిక్కులు ఎదురయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన కీర్తి సింగ్ అనే న్యాయవాది హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2022లో రూ.23.97 లక్షలకు కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ ఎస్‌యూవీలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.

యాక్సిలరేటర్ తొక్కినప్పుడు ఆర్‌పీఎమ్ పెరిగినా కారు వేగం పెరగలేదని సింగ్ ఆరోపిస్తున్నారు. వాహనం కంపించి ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టం పనిచేయకపోవడం లేదన్న హెచ్చరికను ప్రదర్శించింది అంటున్నారు. దీనిపై హ్యుందాయ్ డీలర్‌ను అడిగితే ఇది తయారీ లోపమని, దాన్ని పూర్తిగా సరిచేయడానికి వీలుకాదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.

హ్యుందాయ్ కంపెనీ, డీలర్ షిప్ వారు కారును ఫిక్స్ చేయడానికి లేదా మార్చడానికి నిరాకరించడంతో కీర్తి సింగ్ వారిపై సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని నిబంధనలను కూడా ఆయన ఉపయోగించారు. ఇది తప్పుదోవ పట్టించే ప్రమోషన్లకు మద్దతుదారులను బాధ్యులను చేస్తుంది.

షారుఖ్ , దీపికలపైనా కేసు ఎందుకంటే..
బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు ఇద్దరు నటుల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షారుఖ్ 1998 నుండి హ్యుందాయ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపిక డిసెంబర్ 2023లో హ్యుందాయ్ తో చేరారు. లోపభూయిష్టమైన ఉత్పత్తిని విశ్వసించేలా వారి ఎండార్స్ మెంట్ లు వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని కీర్తి సింగ్ వాదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement