కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!

Section 80EEA Tax Benefit on Home Loans Will Not Be Available From April 1 - Sakshi

కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టం 1960 సెక్షన్ 80 ఈఈఏ కింద అందించే రూ.1.5 లక్షల అదనపు పన్ను ప్రయోజనాన్ని గృహ కొనుగోలుదారులు పొందలేరు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందరికీ ఇళ్లు పథకం కోసం ఆదాయపు పన్ను చట్టం 1960సెక్షన్ 80 ఈఈఏ కింద ఇప్పటి వరకు పన్ను మినహాయింపు కల్పించారు.

కొద్ది రోజుల క్రితం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో 2022-2023 సంవత్సరానికి ఈ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. ఈ పన్ను రాయితీ 2019-2022 ఏడాది వరకు మాత్రమే అందుబాటులో ఉంది. గృహాలు కొనుగోలు చేస్తున్న వారికి ఇకపై పన్ను రాయితీ పొందే అవకాశం లేదు. గృహకొనుగోలుదారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి), సెక్షన్ 80సీ కింద రెండు పన్ను మినహాయింపులను పొందవచ్చు. రుణగ్రహీతలు సెక్షన్ 24(బి) కింద వడ్డీపై మినహాయింపు రూ.2 లక్షల వరకు, సెక్షన్ 80సీ కింద అసలు మొత్తంపై రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు.

సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల కంటే ఎక్కువగా పన్ను రాయితీ అందుకొన్నవారు ఇల్లు కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల అదనంగా తగ్గింపును పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు 24(బి), 80 ఈఈఏ కింద గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.3.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేసుకొనే వీలు ఉంది. అయితే, కొన్ని షరతులు పాటించే వ్యక్తులు మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. 

  • మొదట ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య కాలంలో గృహ రుణం మంజూరు కావాలి. 
  • రెండవది నివాసం స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించి ఉండకూడదు. 
  • మూడవది ఈ ప్రయోజనాన్ని పొందే వ్యక్తి రుణం మంజూరు చేసిన తేదీనాటికి మరే ఇతర ఇంటి ఆస్తిని కలిగి ఉండకూడదు. 
  • రుణాన్ని ఆస్తికొనుగోలు కొరకు మాత్రమే ఉపయోగించాలి. రిపేర్, మెయింటెనెన్స్ లేదా నిర్మాణం కోసం కాదు. 
  • వ్యక్తులు మాత్రమే ఈ మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. 

మార్చి 31, 2022న లేదా అంతకు ముందు గృహ రుణాన్ని పొందిన వ్యక్తి, సెక్షన్ 80ఈఈఏ కింద ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చని ఐటీఆర్ ఫైలింగ్ వెబ్‌సైట్ Tax2win సీఈఓ అభిషేక్ సోనీ తెలిపారు. "2022 మార్చి 31వ తేదీ లేదా అంతకు ముందు గృహ రుణం తీసుకున్న వ్యక్తి సెక్షన్ 80ఈఈఏ ప్రకారం ఈ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి రుణం మంజూరు అయితే.. భవిష్యత్ ఆర్థిక సంవత్సరాల్లో గృహ రుణం పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ఈ మినహాయింపును క్లెయిమ్ చేయగలరు’ అని అభిషేక్ సోనీ చెప్పారు.

(చదవండి: అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top