
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్లలో ఇటీవల మార్పులు చేశాయి. కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్‌లను తొలగించాయి. అయితే ఇప్పటికీ దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు అత్యంత చవకైన ఎంపికగా కొనసాగుతోందని బీఎన్‌పీ పారిబాస్ ప్లాన్ విశ్లేషణ నివేదిక తెలిపింది.
మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఏ టెలికం కంపెనీలో రీచార్జ్ ప్లాన్లు చవకగా.. లాభదాయకంగా ఉన్నాయన్నదానిపై బీఎన్‌పీ పారిబాస్ విశ్లేషించింది. ఇందులో జియో ఇప్పటికీ అదే ధర పాయింట్లలో అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోందని తేల్చింది.
28 రోజుల ప్లాన్‌కు ఇప్పుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మూడు కంపెనీల్లోనూ ధర రూ .299గానే ఉంది. అయితే ప్రయోజనాలపరంగా చూస్తే జియో ఇప్పటికీ అధిక డేటా బెనిఫిట్‌లను అందిస్తోంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే కస్టమర్లకు జియో మరింత చౌకైన ఎంపికగా నిలిచిందని నివేదిక పేర్కొంది.
జియోలో అందుబాటులో ఉన్న ప్లాన్లలో, రూ .799 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. మరోవైపు, రూ .249 ప్లాన్ ఇప్పుడు ఫిజికల్ జియో స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో తొలగించింది. రూ .209 వాయిస్-ఓన్లీ ప్లాన్ కేవలం మై జియో యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక రూ .189 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇంకా రూ.209 ప్లాన్ 22 రోజుల పాటు రోజుకు 1 జీబీని అందిస్తుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2 జీబీని అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్లతో పోలిస్తే జియో కస్టమర్లు నెలకు రూ.50 లబ్ధి పొందుతున్నారని నివేదిక విశ్లేషించింది.
ఉదాహరణకు, రోజుకు 1.5 జీబీ, 28 రోజుల ప్లాన్ ధర జియోకు రూ .299, ఎయిర్‌టెల్, బీఐలు అదే ప్రయోజనం కోసం రూ .349 వసూలు చేస్తున్నాయి. అంటే జియో వినియోగదారులకు నెలకు రూ .50 ఆదా అవుతుందన్న మాట. అదేవిధంగా రోజుకు 2 జీబీ డేటా అందించే 28 రోజుల ప్లాన్‌కు జియో రూ.349, ఎయిర్‌టెల్ రూ.398, వీఐ రూ.365 వసూలు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌తో పోలిస్తే రూ.49, వీఐతో పోలిస్తే రూ.16 చొప్పున జియో యూజర్లకు నెలకు ఆదా అవుతుంది.