
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది.
పరిమిత వినియోగం నిమిత్తం పైలట్ ప్రాతిపదికన ఈ-రూపాయిని త్వరలో ప్రారంభించనున్నామని శుక్రవారం విడుదల చేసిన కాన్సెప్ట్ పేపర్‌లో ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కనిష్టంగా లేదా అంతరాయం కలగని విధంగా ఈ-రూపాయి వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ఇ-రూపాయి తుది డిజైన్‌లో పొందుపరుస్తామని ఆర్బీఐ కాన్సెప్ట్ పేపర్ జారీ సందర్భంగా ప్రకటించింది. ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలతో ఎలాంటి రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీని పౌరులకు అందించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించింది. అలాగే ఇ-రూపాయి నిర్దిష్ట లక్షణాలు,ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని ఆర్బీఐ పేర్కొంది
కాగా ఆర్బీఐ కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధకబాధకాలను పరిశీలిస్తోంది. దశల వారీగా డిజిటల్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే.
Issuance of Concept Note on Central Bank Digital Currencyhttps://t.co/JmEkN7rPyA
— ReserveBankOfIndia (@RBI) October 7, 2022