
ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి
స్థిరమైన డిమాండ్ ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణనిస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధన వ్యయాలు బలంగా ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ రిఫైనరీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ఎస్‌బీఐ రుణ పుస్తకంలో రూ.3–4 లక్షల కోట్లు కార్పొరేట్లవి ఉన్నట్టు చెప్పారు. రిఫైనరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన కంపెనీల నుంచి రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. స్టీల్, సిమెంట్ కంపెనీలు ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు.
‘స్థిరమైన డిమాండ్ రాక కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు డిమాండ్‌కు ఊతమిస్తాయి. లిక్విడిటీ తగినంత ఉండేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గించింది. ఇవన్నీ కార్పొరేట్లలో (కంపెనీల్లో) విశ్వాసాన్ని పెంచుతాయి’ అని శెట్టి వివరించారు. కంపెనీలు ఇప్పటికే తమ సామర్థ్యంలో 75 శాతం వినియోగ స్థాయికి చేరుకున్నాయంటూ, సామర్థ్య విస్తరణ చేపట్టేందుకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ రుణదాతల మాదిరే విలీనాలు, కొనుగోళ్లకు నిధులు సమకూర్చే దిశగా బ్యాంక్‌లను సైతం అనుమతించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కొనుగోళ్లు అన్నవి పారదర్శకతతో కూడిన లావాదేవీలుగా పేర్కొన్నారు. కనుక వీటికి రుణాల రూపంలో మద్దతుగా నిలిచేందుకు బ్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో యోనో యాప్ లిస్టింగ్ ఆలోచనేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం