
ఏడాది కనిష్టాల నుంచి అప్
ఇథనాల్ బ్లెండింగ్‌కు ప్రభుత్వ పుష్
తయారీపై ఆంక్షల ఎత్తివేత
ఏడాది కాలంగా నేలచూపులకే పరిమితమైన షుగర్ షేర్లు ఇటీవల బలపడుతున్నాయి. ఇందుకు పలు సానుకూల పరిణామాలు తోడ్పాటునిస్తున్నాయి. లక్ష్యానికంటే ముందుగానే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్‌కు ప్రభుత్వ దన్ను, ఇథనాల్ తయారీలో చెరకురసం వినియోగంపై ఆంక్షల ఎత్తివేత, దేశీ మార్కెట్లో చక్కెరకు పెరుగుత్ను డిమాండ్ తదితరాలు షుగర్ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షుగర్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం..
–సాక్షి, బిజినెస్ డెస్క్
భారీగా పెరిగిన సరఫరాలు, మందగించిన మార్కెట్ పరిస్థితులు, ఇథనాల్ తయారీపై ఆంక్షలు తదితర ప్రతికూలతల కారణంగా గత ఏడాది కాలంలో షుగర్ కౌంటర్లు డీలా పడ్డాయి. దీంతో చక్కెర తయారీ కంపెనీల షేర్లు 2025 మార్చికల్లా ఏడాది కనిష్టాలకు చేరాయి. అయితే కొద్ది రోజులుగా షుగర్ పరిశ్రమ టర్న్‌అరౌండ్ బాట పట్టింది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నాయి. చక్కెరతోపాటు ఇథనాల్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర బిజినెస్‌లవైపు దృష్టిపెట్టడం, డిస్టిల్లరీల ఏర్పాటు కంపెనీలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నవంబర్ నుంచి ప్రారంభంకానున్న తాజా సీజన్(2025–26)లో షుగర్‌కేన్ జ్యూస్, మొలాసిస్ తదితరాల ద్వారా ఇథనాల్ తయారీ చేపట్టడంలో ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్(2024–25)లో ఇథనాల్ తయారీకి 4 మిలియన్ టన్నులను వినియోగించుకునేందుకు మాత్రమే అనుమతించిన సంగతి తెలిసిందే. వెరసి సవాళ్ల నుంచి సానుకూల పరిస్థితులకు పరిశ్రమ ప్రయాణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.
పండుగల సీజన్
దేశీయంగా పండుగల సీజన్ ప్రారంభంకావడంతో చక్కెరకు డిమాండ్ పెరుగుతోంది. దీనికితోడు దేశీయంగా 2025–26 మార్కెటింగ్ సీజన్‌లో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. ఇది 18 శాతం అధికమని దేశీ చక్కెర మిల్లుల అసోసియేషన్ గత నెలలో వెల్లడించింది. దీంతో 2 మిలి యన్ టన్నుల చక్కెర ఎగుమతులకు వీలు చిక్కనున్నట్లు భావిస్తోంది. అంతేకాకుండా ఇథనాల్ ఉత్పత్తికి 5 మిలియన్ టన్నులకుపైగా మళ్లించవచ్చునని తెలియజేసింది. కర్బనాల కట్టడికి వీలుగా 2025–26కల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్(ఈ20)ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దేశీయంగా ఆటో దిగ్గజాలు ఇందుకు అనుగుణమైన వాహనాల ఉత్పత్తిని చేపట్టి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. దీంతో దేశీ పరిశ్రమ చక్కెరసహా.. ఇథనాల్ తయారీ విక్రయాల ద్వారా లబ్ది పొందనుంది. ఈ ఏడాది చెరకు దిగుబడి ఊపందుకోనున్న అంచనాల కారణంగా అక్టోబర్ నుంచి మొదలుకానున్న చక్కెర సీజన్‌లో ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సగటుకంటే అధికంగా నమోదవుతున్న వర్షపాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర కీలక రాష్ట్రాలలో చెరకు సాగుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇతరత్రా డిమాండ్
ఇథనాల్‌కు ఇంధన రంగంతోపాటు ఇతర పరిశ్రమల నుంచి సైతం డిమాండ్ కనిపించనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఔషధాలు, ప్లాస్టిక్స్, పాలిష్‌లు, కాస్మెటిక్స్ తదితర పరిశ్రమలలోనూ వినియోగం పెరగనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో షుగర్ కంపెనీలకు ఇథనాల్ మనీ స్పిన్నర్‌గా అవతరించనున్నట్లు విశ్లేషించాయి. వెరసి భవిష్యత్‌లో షుగర్ కంపెనీలకు ఇథనాల్ అనూహ్య లాభాలను తెచి్చపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. నిజానికి 2023 ఏప్రిల్ నుంచే ఆటో రంగ దిగ్గజాలు ఈ20 సంబంధిత ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ20 పూర్తిస్థాయి అమలుకు వీలుంది.
తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పలు రంగాలకు ఊతమిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సంస్కరణలకు తెరతీసింది. ప్రధానంగా 12 శాతం, 5 శాతం శ్లాబులలోకి పలు ప్రొడక్టులను చేర్చడంతోపాటు ఈ నెల 22 నుంచి అమలుకు నిర్ణయించింది. దీంతో ఆటోసహా ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్, ఫుట్‌వేర్, హోటళ్లు తదితర రంగాలు జోరందుకోనున్నాయి. ఇది వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం ద్వారా విభిన్న రంగాలలో డిమాండ్‌కు దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా షుగర్ రంగ షేర్లు లాభాల బాటలో సాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు.
ఏటికి ఎదురీత
గతేడాది కాలంలో షుగర్ షేర్లు క్షీణిస్తూ దాదాపు 52 వారాల కనిష్టానికి చేరినప్పటికీ ఈఐడీ ప్యారీ ఇండియా, బన్నారీ అమ్మన్ షుగర్స్, బలరామ్‌పూర్ చినీ లాభాలతో నిలదొక్కుకోవడం విశేషం! ఇందుకు ఆయా కంపెనీలు షుగర్‌తోపాటు.. ఇతర విభాగాలలోకి ప్రవేశించడం, అవసరానికి అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టగల డిస్టిల్లరీలను ఏర్పాటు చేసుకోవడం సహకరించినట్లు తెలియజేశారు. పటిష్ట ఫైనాన్షియల్స్‌కుతోడు నామమాత్ర రుణభారం వంటి సానుకూలతలు సైతం వీటికి జత కలిసినట్లు విశ్లేషించారు.
ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది?