
మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలన్నది నా ఆలోచన. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – సాత్విక్
మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడులు అనుకూలం కాదు. స్వల్పకాలానికి ఈక్విటీలు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. కనుక స్వల్పకాలం కోసం భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో స్థిరమైన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ లక్ష్య కాలాన్ని మూడేళ్లకు మించి పెంచుకోగలిగి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి.
ప్రాపర్టీ విక్రయించగా వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – వీరేశ్
ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ తదితర ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే బాండ్లను క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. ఇవి ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను ఈ బాండ్లపై లభించే నికర రాబడి 3.68 శాతం అవుతుంది. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఈక్విటీల్లో దీర్ఘకాలానికి రెండంకెల రాబడి వస్తుంది.
ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే రూ.50 లక్షల లాభంపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరొచ్చు. ఇలా చూస్తే మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది అవుతుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సరికాదు.
ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇది కచ్చితమని చెప్పలేం. ఆటుపోట్లు ఉంటాయి. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన పన్ను లేని రాబడిని ఇస్తాయి. కనుక రిస్క్ లేని రాబడి కోరుకుంటూ, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం తిరిగి వెనక్కి తీసుకోవాలని అనుకుంటే క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు.

ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లోనే.. జీతం ఎక్కువ!