పండుగ సీజన్‌ మార్కెటింగ్‌కు రూ.100 కోట్లు: పేటీఎం

Paytm earmarks Rs 100 crore for marketing campaigns during festive season - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రచార కార్యక్రమాల కోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, యూపీఐపరమైన ప్రోత్సాహకాలు, ’బై నౌ, పే లేటర్‌ (ఇప్పుడు కొనుక్కోండి, తర్వాత కట్టండి)’ వంటి ఆఫర్లు మొదలైన వాటికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 14 దాకా ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతూ ’పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ధమాకా’ ఆఫర్‌ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది.

‘పండుగ సీజన్‌ డిమాండ్‌ తారాస్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రోజు 10 మంది లక్కీ విన్నర్లు తలో రూ. 1 లక్ష గెల్చుకోవచ్చు. అలాగే 10,000 మంది విజేతలు రూ. 100 క్యాష్‌బ్యాక్, మరో 10,000 మంది యూజర్లు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. ఇక దీపావళి దగ్గరపడే కొద్దీ (నవంబర్‌ 1–3) యూజర్లు రోజూ రూ. 10 లక్షల దాకా గెల్చుకోవచ్చు‘ అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ డీటీహెచ్‌ రీచార్జీలు, బిల్లుల చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్, ట్రావెల్‌ టికెట్ల బుకింగ్, కిరాణా దుకాణాల్లో చెల్లింపులు మొదలైన లావాదేవీలకు  క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు అందుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top