
కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్‌లో పని చేస్తున్నారు. వీరిపై ప్రభావంపడే అవకాశం ఉంది.
కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్‌పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్‌ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు
గత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్‌ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్‌టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు.