
ప్రభుత్వ సేవల్లో ఉత్పాదకతను పెంచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించేలా చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్‌ఏఐ ప్రభుత్వ డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడుతుంది. విద్య, రక్షణ, భద్రత, న్యాయ వ్యవస్థలో ఉపయోగించే ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ల్లో ఏఐ ఆధారిత కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరు వర్గాలు తెలిపాయి.
యూకేలో మార్పు తీసుకురావడానికి, ఆర్థిక వృద్ధిని మెరుగు పరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం కానుందని ప్రభుత్వ టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ అన్నారు. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను స్వీకరించడం ద్వారా గతంలో స్థానిక సంగీతకారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏఐ టూల్స్ తమ సంగీతాన్ని లైసెన్స్ లేకుండా ఉపయోగించడాన్ని వారు వ్యతిరేకించారు.
ఇదీ చదవండి: టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
ప్రస్తుతం ప్రాథమికంగా 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న లండన్ కార్యాలయంలో ఓపెన్ ఏఐ సర్వీసులను విస్తరించనుంది. క్రమంగా ఏఐ సేవలు ఇతర విభాగాలకు వ్యాపిస్తాయని ఇరువర్గాలు తెలిపాయి. ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఏఐ అనేది దేశ నిర్మాణానికి కీలకమైన సాంకేతికత అని తెలుపుతూ, ఇది ఆర్థిక వ్యవస్థలను మారుస్తుందని చెప్పారు.