
జీఎస్‌టీ తగ్గింపు నేపథ్యంలో వేచి చూసే ధోరణి
ఇది తాత్కాలికమేనంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: కీలకమైన పండుగల సమయంలో వినియోగదారులు (ఆన్‌లైన్ షాపర్లు) ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ గూడ్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) క్రమబద్దీకరణతో రేట్లు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, ఒక్కసారి పన్ను రేట్లపై స్పష్టత వస్తే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయన్నది నిపుణుల అంచనా.
కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్‌టీలో శ్లాబుల తగ్గింపును వేగంగా అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ కానుంది. ప్రస్తుతం వివిధ రకాల వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం జీఎస్‌టీ రేట్లు అమల్లో ఉండడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులను ఎత్తివేయాలన్నది ప్రతిపాదన. అప్పుడు అధిక శాతం వస్తు సేవలు 5 లేదా 18 శాతం రేట్ల పరిధిలోకి వస్తాయి. వాషింగ్ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎన్నో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గనుంది.
ఈ–కామర్స్‌పై కనిపిస్తున్న మార్పు..
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారుల కొనుగోళ్ల పరంగా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు గ్రాంట్ థార్న్‌టన్ భారత్ పార్ట్‌నర్ నవీన్ మల్పానీ తెలిపారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విషయంలో ఈ ధోరణి నెలకొన్నట్టు చెప్పారు. ‘‘జీఎస్‌టీ రేట్లపై స్పష్టత ఆలస్యమయితే అప్పుడు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు తదితర విభాగాలపై 25–30 శాతం మేర ప్రభావం పడొచ్చు. కొత్త శ్లాబులు అమల్లోకి వస్తే రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ప్రస్తుత వేచి చూసే ధోరణికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు రూ.1.2 లక్షల ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ధర జీఎస్‌టీలో సంస్కరణల అనంతరం 10 శాతం మేర తగ్గనుంది. ఈ అంచనాలు కొనుగోళ్ల నిర్ణయాలను వాయిదా వేసుకునేందుకు దారితీస్తున్నాయి’’అని మల్పానీ వివరించారు.
అమ్మకాలు వేగంగా పెరుగుతాయ్..
‘‘రిటైలర్ల వద్ద ఉత్పత్తుల నిల్వలు అధికంగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో కొనుగోళ్లు వాయిదా పడుతున్నాయి. పండుగల సీజన్ చివర్లో (అక్టోబర్) పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు ఈ–కామర్స్ సంస్థలు బ్రాండ్లతో సంప్రదింపులు చేస్తున్నాయి. జీఎస్‌టీలో పన్ను రేట్ల సవరణ ధరల వ్యూహాల్లోనూ మార్పులకు దారితీయనుంది. మొత్తం మీద సమీప కాలంలో కనిపించే ప్రభావం తాత్కాలికమే. కొత్త పన్నులపై ఒక్కసారి స్పష్టత వస్తే అమ్మకాలు వేగంగా పుంజుకుంటాయి’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ శుభమ్ నింకార్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలకు పండుగల సీజన్ ఎంతో కీలకం. వార్షిక అమ్మకాల్లో పావు శాతం ఈ సమయంలోనే నమోదవుతుంటాయి.
పండుగ షాపింగ్ ప్రత్యేకం..
పండుగల సమయంలో కొనుగోళ్లు కేవలం సంస్కృతిలో భాగమే కాకుండా, భావోద్వేగపరమైనవి అని షిప్‌రాకెట్ ఎండీ, సీఈవో సాహిల్ గోయల్ పేర్కొన్నారు. ‘‘కొత్త గృహోపకరణం అయినా, గ్యాడ్జెట్ అయినా లేక గృహ నవీకరణ అయినా పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు కుటుంబాలు ప్రణాళికలతో ఉంటాయి. ఈ అంతర్గత డిమాండ్ కచ్చితంగా కొనసాగుతుంది. జీఎస్‌టీ క్రమబదీ్ధకరణ అన్నది కొనుగోళ్ల దిశగా వినియోగదారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది.
రేట్ల సవరణతో ధరలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది’’అని వివరించారు. జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ అన్నది నిర్మాణాత్మక సంస్కరణ అని, వినియోగానికి బలమైన ఊతం ఇస్తుందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ సైతం అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీలో మార్పులు అమల్లోకి వచ్చినట్టయితే పండుగల సీజన్‌లో ఈ–కామర్స్ అమ్మకాలు మొత్తం మీద 15–20 శాతం పెరగొచ్చని (గతేడాదితో పోల్చితే) మల్పానీ అంచనా వేశారు.