ఇక ఏసీలు, టీవీలు చౌక!  | Air conditioner, TV makers upbeat about sales amid signs of GST cuts | Sakshi
Sakshi News home page

ఇక ఏసీలు, టీవీలు చౌక! 

Aug 19 2025 4:23 AM | Updated on Aug 19 2025 8:13 AM

Air conditioner, TV makers upbeat about sales amid signs of GST cuts

 ఒక్కో ఏసీపై రూ.2,500 తగ్గుదల 

వినియోగం మరింత పెరుగుతుంది 

పెద్ద సైజు టీవీలపైనా ఉపశమనం 

పరిశ్రమ వర్గాల అంచనా 

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌ కండీషనర్లపై (ఏసీలు) 28 శాతంగా ఉన్న జీఎస్‌టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో మోడల్‌ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్‌ ధర రూ.1,500–2,500 మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపైనా జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికితోడు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో ఆదాయపన్ను మినహాయింపులు కలి్పంచడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఏసీల కొనుగోళ్లను పెంచుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది.  

పెద్ద ముందడుగు 
రూమ్‌ ఏసీల కొనుగోళ్లు నిలిచిపోయినందున జీఎస్‌టీలో ప్రతిపాదిత సంస్కరణలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని బ్లూస్టార్‌ ఎండీ బి. త్యాగరాజన్‌ కోరారు. ‘‘ఆగస్ట్‌ నెలలో రూమ్‌ ఏసీలను ఎవరూ కొనరు. సెపె్టంబర్‌ లేదా అక్టోబర్‌ 1 వరకు వేచి చూడొచ్చు. ఈ కాలంలో డీలర్లే కాదు, కస్టమర్లు కూడా కొనుగోళ్లు చేయరు’’అంటూ అన్‌సీజన్‌ను ఆయన గుర్తు చేశారు. 10 శాతం వరకు ఏసీల ధరలు తగ్గొచ్చొని చెప్పారు. 

ఇంధన ఆదా చేసే ఏసీలపై తక్కువ జీఎస్‌టీని అంచనా వేస్తున్నామని.. ఇతర ఏసీల ధరలు 18% రేటు పరిధిలో ఉండొచ్చని ప్యానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా చైర్మన్‌ మనీష్‌ శర్మ అభిప్రాయపడ్డారు. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా కానీ ఉత్పత్తుల ధరలు 6–7 శాతం మేర (రూ.1,500–2,500) దిగిరావొచ్చని చెప్పారు. ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ సైతం అంచనా వేసింది.

‘‘దేశంలో ఏసీల వినియోగం ఇప్పటికీ 9–10 శాతంగానే ఉంది. జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది ప్రజలకు ఏసీల ధరలు అందుబాటులోకి వస్తాయి. దీంతో చాలా మంది భారతీయుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’అని గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అప్లయెన్సెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు. ప్రస్తుతం రూమ్‌ ఏసీలపై 28% జీఎస్‌టీ అమల్లో ఉండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లపై 18 శాతం రేటు అమలు అవుతున్నట్టు తెలిపారు.  

ఏసీ, టీవీలకు అనుకూలం.. 
థామ్సన్, బ్లోపంక్త్‌ తదితర బ్రాండ్లపై టీవీలను తయారు చేసి విక్రయించే సూపర్‌ ప్లా్రస్టానిక్స్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మార్వా సైతం ప్రభుత్వ చర్యతో పండుగల సీజన్‌లో వినియోగం పెరుగుతుంని అంచనా వేశారు. ఏసీ, స్మార్ట్‌ టీవీలు (32 అంగుళాల పైన) 28% జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయంటూ.. రేట్లను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. తాము 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక 32 అంగుళాల టీవీలను 5% జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ సెగ్మెంట్‌లో 38 శాతం అసంఘటిత రంగం నుంచే వస్తున్నట్టు చెప్పారు. వేసవిలో ముందస్తు వర్షాలతో ఈ ఏడాది ఏసీ అమ్మకాలు తగ్గాయి.

గొప్ప సంస్కరణ 
జీఎస్‌టీ పునర్‌నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఎంతో ముఖ్యమైన సంస్కరణ. దీని ద్వారా ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆటో పరిశ్రమపై పడే ప్రభావంపై వ్యాఖ్యానించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడడం మంచిది.
– ఆర్‌సీ భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement