
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్లను అధిగమించింది. గత 8 నెలల్లోనే కోటిమంది జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. కాగా.. ప్రతీ నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టర్ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లను దాటింది.
నిజానికి ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు ప్రారంభమైన 14ఏళ్ల తదుపరి ఇన్వెస్టర్ల సంఖ్య కోటికి చేరింది. తదుపరి కోటిమంది ఏడేళ్లలో జత కలవగా.. ఆపై మూడున్నరేళ్లలోనే ఈ సంఖ్యకు మరో కోటి జమయ్యింది. ఈ బాటలో ఆపై.. ఏడాదికి అటూఇటుగా మరో కోటిమంది జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. వెరసి ఎన్‌ఎస్‌ఈ ఆవిర్భవించిన 25ఏళ్లకు అంటే 2021 మార్చికల్లా ఇన్వెస్టర్ల (Stock market investors) సంఖ్య 4 కోట్ల మైలురాయిని తాకింది. ఆపై వేగం పెరిగి 6–7 నెలల్లోనే మరో కోటి మంది ఇన్వెస్టర్లు తోడయ్యారు.
ఈ స్పీడుకు ప్రధానంగా డిజిటైజేషన్, ఫిన్‌టెక్ సేవల అందుబాటు, మధ్యతరగతి పెరగడం, ప్రభుత్వ పాలసీల మద్దతు సహకరించాయి. 2025 సెపె్టంబర్ 23కల్లా ఎన్‌ఎస్‌ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య 23.5 కోట్లకు చేరింది. అన్ని రకాల క్లయింట్ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్యకాగా.. క్లయింట్లు ఒక సభ్యునికంటే అధికంగా కూడా రిజిస్టరయ్యేందుకు వీలుంది.
రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లలో 12 కోట్లమంది సగటు వయసు 33 ఏళ్లుకాగా.. 1.9 కోట్లమంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1.4 కోట్లమంది రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లరీత్యా ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకును పొందగా, 1.03 కోట్లతో గుజరాత్ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది.