
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తే దేశీయంగా రెస్టారెంట్ రంగం 2028 నాటికి 1.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ జొరావర్ కల్రా తెలిపారు. ఇందుకోసం ‘పరిశ్రమ’ హోదా కల్పించాలని, జీఎస్‌టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాల్లాంటివి ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం 85 లక్షల మంది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఎన్‌ఆర్‌ఏఐలో సుమారు 5 లక్షల రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది. సొంత ప్రైవేట్–లేబుల్ బ్రాండ్లతో క్విక్ కామర్స్ విభాగంలో దూసుకెళ్లిపోతున్న స్విగ్గీ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లతో నెలకొన్న వివాదం సామరస్యంగా సద్దుమణుగుతుందని కల్రా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్ 2024 అంచనా ప్రకారం ఈ రంగం విలువ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.5.69 లక్షల కోట్లు. ఇది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.7.76 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
రెస్టారెంట్ రంగాన్ని అభివృద్ధి చేసే సాంకేతిక అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డైనమిక్‌గా వ్యవహరిస్తోంది. వీటి కార్యకలాపాలను పెంచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్, ఏఐ ఆధారిత రిజర్వేషన్ సిస్టమ్‌లు, ఆటోమేటెడ్ ఆర్డర్ ప్రాసెసింగ్‌లను చాలా సంస్థలు మెరుగుపరుస్తున్నాయి. ఇది క్లౌడ్-ఆధారిత నిర్వహణ సాఫ్ట్‌వేర్‌లో ట్రాకింగ్‌ను క్రమబద్ధీకరించడానికి, వ్యర్థాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది.