
దెనిసా టెక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ముండ్రు ఫణీంద్ర
జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామన్నది ముఖ్యం కాదు. ఎక్కడికి చేరతామన్నదే మన విలువను నిర్ణయిస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశ నుంచే కష్టపడుతూ, మూడు విభిన్న రంగాల్లో.. సాఫ్ట్‌వేర్, ఆటోమొబైల్, మీడియాలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ముండ్రు ఫణీంద్ర. ఈయన కథ కేవలం వ్యాపార విజయమే కాదు, పట్టుదలతో కలల్ని సాకారం చేసుకున్న ఒక నిజ జీవిత ఉదంతం. జీవితంలో సాధించాలన్న తపన, సాధించేవరకు ఆగని కృషి; ఈ రెండు గుణాలే తనను నేడు విశిష్టమైన వ్యక్తిని చేశాయి.

1990 సెప్టెంబర్ 19న జన్మించిన ఫణీంద్ర, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, విద్య పట్ల గౌరవం వంటి విలువలను అలవాటు చేసుకున్నారు. తండ్రి ముండ్రు అబ్రహం నిబద్ధత, తల్లి ముండ్రు మణి సహనం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సోదరి మాతంగి రమ్యావిద్యాసాగర్ ఎల్లప్పుడూ అండగా నిలిచి, ప్రతి అడుగులో ప్రోత్సాహం అందించారు. ఈ కుటుంబ బంధమే ఆయన ప్రతి విజయానికి పునాది.
ఫణీంద్ర చిన్నప్పటి నుంచే కేవలం చదువు మీదే కాకుండా, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, ఏ పని చేసినా నాణ్యతతో చేయాలనే పట్టుదల ఆయన విజయసుత్రాలు. ఈ విలువలు, ఆయన తల్లిదండ్రులు నేర్పిన జీవన సూత్రాలు, ఆయన ప్రతి నిర్ణయంలో ప్రతిఫలించాయి.

బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సమయం నుంచే ఫణీంద్ర స్వతంత్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. గూగుల్ ఆఫ్‌లైన్ అసైన్‌మెంట్లు చేసి, టెక్నాలజీ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ సమయంలోనే దేశ, విదేశాల కస్టమర్ల కోసం అనేక వెబ్‌సైట్లు డిజైన్ చేసి, సాంకేతిక నైపుణ్యాలలోనూ పట్టు సాధించారు. చదువుతో పాటు చేసిన ఈ ప్రాజెక్టులు ఆయనలో విశ్వాసాన్ని పెంచి, పెద్ద స్థాయి ప్రాజెక్టులను తీసుకునే ధైర్యాన్ని ఇచ్చాయి.
దాదాపు పదకొండు సంవత్సరాల కృషి, వ్యూహాత్మక ఆలోచన, నిరంతర శ్రమతో ‘దెనిసా టెక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ కస్టమర్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, సమయానికి వినూత్న పరిష్కారాలు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారదర్శక విధానాలు, నాణ్యతకు ప్రాధాన్యత, సమయపాలనలో రాజీపడని ధోరణి ఈ సంస్థ విజయానికి కారణమయ్యాయి. ఫణీంద్ర నాయకత్వంతో పాటు నాణ్యతతో కూడిన ప్రమాణాలు, బృందంపై నమ్మకం, సృజనాత్మకతకు ప్రోత్సాహం; కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది.

టెక్నాలజీ రంగంలో విజయాలను అందుకున్న తర్వాత, ఆటోమొబైల్ రంగంలో కూడా అడుగుపెట్టారు. తన భార్య స్రవంతితో కలిసి అబిగైల్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. తమ కుమార్తె పేరుతోనే కంపెనీకి పేరు పెట్టడం ద్వారా వ్యాపారానికి కుటుంబ అనుబంధాన్ని జోడించారు. కస్టమర్ విశ్వాసం, పారదర్శక సేవలు, నాణ్యత.. ఇవే అబిగైల్ విజయానికి ప్రధానమైన మూలాలు.
ఫణీంద్ర భార్య స్రవంతి వ్యాపార నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రతి సందర్భంలో అండగా నిలిచారు. పిల్లలు అబిగైల్, మాల్విన్ అబ్రహం ఆయన ప్రతీ విజయానికి ప్రేరణ. వ్యాపారాల్లో ఎప్పుడూ మార్పులు, పోటీలు, అనిశ్చితి సహజం. ఫణీంద్ర ఈ సవాళ్లను వెనుకడుగు వేయడానికి కారణంగా కాకుండా, కొత్త అవకాశాలుగా మలచుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రారంభ దశలో నమ్మకం సంపాదించడం, క్లయింట్లను దీర్ఘకాలంలో ఉండేలా చేయడం పెద్ద సవాల్. కానీ, ప్రతి ప్రాజెక్ట్‌ను సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం ద్వారా ఆ సవాలును అధిగమించారు. అందుకే క్రమంగా అంతర్జాతీయ క్లయింట్ల వరకు ఈ సంస్థ పరిధి విస్తరించింది.
ఫణీంద్ర భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో తన వ్యాపార పరిధిని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సొల్యూషన్లపై దృష్టి సారించడం, ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసింగ్, కస్టమైజేషన్ విభాగాలను ప్రవేశపెట్టడం ఆయన ప్రణాళికలో ఉన్నాయి. అలాగే, సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, చిన్న వ్యాపారాలకు డిజిటల్ టూల్స్ అందించడం, పర్యావరణ స్నేహపూర్వక వ్యాపార మోడల్స్‌ను రూపొందించడం ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగం.

ముండ్రు ఫణీంద్ర జీవన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు, అది ఒక స్పష్టమైన సందేశం కూడా. పట్టుదల, కృషి, నిజాయితీ, స్పష్టమైన దిశ ఉంటే ఏ కల అయినా నిజం కావచ్చని ఆయన నిరూపించారు. విద్యార్థి దశలోనే అనుభవాన్ని సంపాదించడం నుంచి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలను స్థాపించడం వరకు, ఆయన ప్రతి అడుగూ ప్రణాళికాబద్ధంగానే కాక, విలువలతో నిండినదే. తన కుటుంబం మద్దతుతో, తన సొంత శ్రమతో, విభిన్న రంగాలలో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా తన వ్యాపారాలను నడపడం ఆయన ప్రత్యేకత. తరతరాలకు ప్రేరణగా నిలిచే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ‘స్వప్నాలను కేవలం చూడకండి, వాటిని సాధించడానికి శ్రమించండి’ అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది.