Massive Data Breach: శాంసంగ్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌

massive data breach Samsung personal data birthdays phone number exposed - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్‌ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్‌ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్‌ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్‌ సమాచారంలో తెలిపింది.

అనధికారిక థర్డ్ పార్టీ  ద్వారా అమెరికా సిస్టమ్‌ల నుంచి  వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్‌ సెక్యూరిటీ నంబర్‌లు క్రెడిట్,  డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్‌ నిర్ధారించింది.

డేటా లీకైన సిస్టమ్‌లను సేఫ్‌గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్‌ చేసే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top