ఇండోనేషియాలో ప్రాజెక్టు.. ఇండియన్లకి తాకిన పన్నుల పోటు

Malaysia Surpasses Indonesia To Become India's Top Palm Oil Supplier - Sakshi

పామ్‌ బేస్డ్‌ బయో డీజిల్‌ ప్రాజెక్టు చేపట్టిన ఇండోనేషియా

నిధుల కోసం పామాయిల్‌ ఎగుమతిపై భారీ సుంకాలు

ఇండోనేషియా నుంచి ఇండియాకు భారీగా పామాయిల్‌ దిగుమతులు

ప్రత్యామ్నయంగా మలేషియా వైపు చూస్తున్న ఇండియా   

న్యూఢిల్లీ : ఇండోనేషియాలో నిర్మిస్తున్న పామ్‌బేస్‌డ్‌ బయో డీజిల్ ప్రాజెక్టు ఇండియాకు చేటు తెచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీగా నిధులు సమకూర్చుతోంది ఇండోనేషియా. అందు కోసం ఆ దేశ ప్రధాన ఆదాయ వనరులో ఒకటైన పామాయిల్‌ ఎగుమతులపై భారీగా కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తోంది. 

ఏడు నెలలుగా
ఓ వైపు అమెరికా, బ్రెజిల్‌లలో కరువు కారణంగా వంట నూనె ధరలు పెరిగాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌కి మళ్లుదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. వంట నూనెల్లో ఎప్పుడు చవకగా లభించే పామాయిల్‌ ధర​ సైతం లీటరు రూ. 150 దగ్గర ఉంది. దీనికి కారణం ఇండోనేషియాలో పెరిగిన ఎగుమతి పన్నులు.

నిధుల సేకరణ
పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా పామ్‌ బేస్డ్‌ బయో డీజిల్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఇండోనేషియా చేపట్టింది. దీనికి నిధుల సమీకరణకు పామ్‌నే ఎంచుకుంది. దీంతో ఒక​‍్కసారిగా పామాయిల్‌ ఎగుమతిపై గత డిసెంబరులో ఉన్నట్టుండి పన్నులు పెంచింది. టన్ను పామాయిల్‌ కస్టమ్స్‌ డ్యూటీని 438 డాలర్లకు పెంచింది. అంతటితో ఆగకుండా క్రూడ్‌ పామాయిల్‌ లేవీని టన్నుకు రూ. 225 డాలర్లుగా నిర్ణయించింది. మన దేశ పామాయిల్‌ అవసరాల్లో యాభై శాతం ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. గత డిసెంబరు నుంచి పెరిగిన పన్నులతో ఇండియాలో కూడా పామాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

మలేషియా
ఇండోనేషియాలో పన్నుల భారం భరించలేని విధంగా పెరిగిపోవడంతో మలేషియా నుంచి పామ్‌ఆయిల్‌ ఇండియా దిగుమతి చేసుకుంటోంది.మలేషియా సైతం సుంకాలు తగ్గించడంతో ఇండియాకి పామాయిల్‌ ఎగుమతులు ఏకంగా 238 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇండోనేషియా దిగుమతులు 32 శాతం తగ్గాయి. 

ధరలు తగ్గేదెన్నడు
ఇండోనేషియాలో ఎగుమతి సుంకం పెరిగిపోవడంతో మలేషియా వైపు ఇండియా మళ్లింది. దీంతో ఎగుమతి పన్నులు తగ్గించాలంటూ ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఇండియా అవసరాలను గమనించిన మలేషియా సైతం క్రమంగా క్రమంగా పన్నులు పెంచుతోంది. ఏతావతా ఇండోనేషియా, మలేషియాల మధ్య జరుగుతున్న పామాయిల్‌ వాణిజ్యంలో ఇండియాలో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. కనీసం పామాయిల్‌ ధరలైనా తగ్గేలా చూడాలని కోరుతున్నారు. 

చదవండి : చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్‌ చూపు! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top