వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్‌ జోరు

Indian Automobile Industry To Grow At Single Digit Growth In 2024 Says Icra - Sakshi

2022–23లో 6–9 శాతం 

2023–24లో అధిక సింగిల్‌ డిజిట్‌ అమ్మకాలు 

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

ముంబై: దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచిగా కోలుకుందని, వచ్చే ఆర్థిక సంవ్సరంలో సింగిల్‌ డిజిట్‌లో అధిక వృద్ధిని చూస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, రవాణా కార్యకలాపాలు పెరగడం వృద్ధికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. విభాగాల వారీగా చూస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 6–9 శాతం మధ్య, వాణిజ్య వాహనాల అమ్మకాలు 7–10 శాతం మధ్య వృద్ధిని చూస్తాయని ఇక్రా తెలిపింది.

అలాగే, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6–9 శాతం మధ్య, ట్రాక్టర్ల విక్రయాలు 4–6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ప్యాసింజర్‌ వాహనాలు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల విభాగంలో డిమాండ్‌ ఆరోగ్యకరంగా ఉందని తెలిపింది. కానీ, ద్విచక్ర వాహన విభాగం ఇప్పటికీ సమస్యలను చూస్తోందని, విక్రయాలు ఇంకా కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించలేదని వివరించింది. ఇటీవల పండుగలు, వివాహ సీజన్‌లో విక్రయాలు పెరిగినప్పటికీ.. స్థిరమైన డిమాండ్‌ రికవరీ ఇంకా కనిపించలేదని తెలిపింది. ఆరంభ స్థాయి కార్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది.  

ధరల పెంపు ప్రభావం.. 
‘‘కరోనా కారణంగా ఏర్పడిన అవరోధాలు, సవాళ్లను అధిగమించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు వాహనాల ధరలను కంపెనీలు గణనీయంగా పెంచాయి. దీంతో దిగువ స్థాయి వాహన వినియోగదారుల కొనుగోలు శక్తి తుడిచిపెట్టుకుపోయింది. 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో గరిష్ట స్థాయి సింగిల్‌ డిజిట్‌ (8–9 శాతం) అమ్మకాలు నమోదవుతాయని అంచనా వేస్తున్నాం’’అని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శంషేర్‌ దేవాన్‌ తెలిపారు. ద్విచక్ర వాహన విభాగంలో మాత్రం వృద్ధి మోస్తరుగా ఉండొచ్చన్నారు. ‘‘2023–24 బడ్జెట్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కింద గ్రామీణ ఉపాధి కోసం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇరిగేషన్‌ వసతుల పెంపునకు, పంటల బీమా పథకం కోసం కేటాయింపులు పెంచొచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌కు మద్దతునిస్తుంది’’ అని దేవాన్‌ అంచనా వేశారు.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
      

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top