ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం..

India will be second-largest economy by 2050 says Gautam Adani - Sakshi

2050 నాటికి రెండో అతి పెద్ద ఎకానమీగా భారత్‌

అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ ధీమా  

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పడిపోనుందన్న వార్తల ఆధారంగా భారత్‌ సత్తాను అంచనా వేయరాదని అదానీ గ్రూప్‌ చీఫ్‌ గౌతమ్‌ అదానీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, 2050 నాటికి రెండో అతి పెద్ద ఎకానమీగా భారత్‌ ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇందుకు కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. జేపీ మోర్గాన్‌ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ ఈ విషయాలు తెలిపారు. ‘జీడీపీ గణాంకాల ఫ్యాన్స్‌కు కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను.

1990లో ప్రపంచ జీడీపీ 38 లక్షల కోట్లుగా ఉండేది. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు 90 లక్షల కోట్లుగా ఉంది. మరో 30 ఏళ్ల తర్వాత..అంటే 2050లో ఇది సుమారు 170 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. అప్పటికి భారత్‌ నిస్సందేహంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీగా మారుతుంది‘ అని అదానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంక్షోభం తగిలే ఎదురుదెబ్బలు స్వల్పకాలికమైనవేనని, వీటి ఆధారంగా భారత్‌ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దని ఆయన సూచించారు. ఓర్పు, దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండా ఆధారంగా పనిచేయడం కీలకమని ఆయన చెప్పారు.

సవాళ్లు ఉన్నాయ్‌..కానీ..
భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. దేశానికి వచ్చే దశాబ్ద కాలంలో 1.5–2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమని అదానీ చెప్పారు. జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల ఫండ్‌ ఏర్పాటు వంటి కీలకమైన వ్యవస్థాగత సంస్కరణలు అమల్లోకి తెచ్చినప్పటికీ సాధికారిక నియంత్రణ సంస్థలు లేకపోవడమనేది జాతి నిర్మాణం, పెట్టుబడుల అవకాశాలకు అవరోధంగా ఉంటోందని ఆయన తెలిపారు. ‘ఒక వ్యాపారవేత్తగా నేను ఆశావహంగా ఉంటాను. నా కళ్లతో చూడండి. పుష్కలంగా వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి. స్వల్పకాలిక ఆలోచనలతో దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయలేమని నేను భావిస్తాను. పాత చింతకాయ పచ్చడి లాంటి పాశ్చాత్య వృద్ధి గణాంకాల కోణం నుంచి ఇతర దేశాలను చూడటం మానుకోవాలి. ఒకో దేశంలో ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక్కో రకంగా ఉంటుందని గుర్తించాలి‘ అని అదానీ సూచించారు.

రూపాయికి 800 రెట్లు లాభం..
రెండున్నర దశాబ్దాల క్రితం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.1 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ప్రస్తుతం 800 రెట్లు రాబడులు అందుకునే వారని అదానీ తెలిపారు. నౌకాశ్రయాలు మొదలుకుని విమానాశ్రయాల దాకా వివిధ రంగాల్లోకి విస్తరించిన తమ గ్రూప్‌ ఆరు లిస్టెడ్‌ కంపెనీలను ఏర్పాటు చేసిందని, వేల కొద్దీ ఉద్యోగాలు సృష్టించడంతో పాటు షేర్‌హోల్డర్లకు అసాధారణ రాబడులు అందించిందని వివరించారు. కాలేజ్‌ చదువును మధ్యలోనే వదిలేసిన అదానీ ముందుగా కమోడిటీల్లో ట్రేడింగ్‌తో ప్రారంభించి దేశీయంగా అతి పెద్ద వ్యాపార గ్రూప్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1994లో ఐపీవోకి వచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top