
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల్లో ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు బ్యాంకింగ్‌ను మరింత సురక్షితంగా, సమ్మిళితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ఈ ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.
యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫ్రేమ్‌వర్క్ కింద అభివృద్ధి చేసిన ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఖాతాదారులు ముఖ గుర్తింపును ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇకపై వేలిముద్రలు లేదా ఓటీపీల వంటి భౌతిక బయోమెట్రిక్ ఇన్‌పుట్‌ల అవసరం ఉండదు.
"ఐపీపీబీలో, బ్యాంకింగ్ అందుబాటులో ఉండటమే కాదు.. హుందాగా ఉండాలని మేము నమ్ముతున్నాం. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్రలు లేదా ఓటీపీ ధృవీకరణలో పరిమితుల కారణంగా ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఇది కేవలం టెక్ ఫీచర్ మాత్రమే కాదు. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని పునర్నిర్వచించే దిశగా ఒక అడుగు" అని ఐపీపీబీ ఎండీ, సీఈవో ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.
ఫేస్ ఆథెంటికేషన్ ఫీచర్ కీలక ప్రయోజనాలు
ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్లపై ఆధారపడకుండా ఆధార్ ఆథెంటికేషన్ సురక్షితం
సులువైన కస్టమర్ అనుభవం కోసం వేగవంతమైన, కాంటాక్ట్ లెస్ లావాదేవీలు
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన బ్యాంకింగ్
ఖాతా తెరవడం, బ్యాలెన్స్ విచారణ, ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, యుటిలిటీ చెల్లింపులతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలకు మద్దతు.