
చైనాను మించి సరఫరా కెనాలిస్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వివాదాలతో అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో తొలిసారిగా అగ్రరాజ్యానికి చైనాకన్నా అధికంగా స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసింది. కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. దీని ప్రకారం అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో చైనాలో అసెంబుల్ చేసిన ఫోన్ల వాటా గతేడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 61 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే వ్యవధిలో 25 శాతానికి తగ్గింది.
అదే సమయంలో భారత్ వాటా 13 శాతం నుంచి 44 శాతానికి (సుమారు 240 శాతం వృద్ధి) పెరిగింది. క్యూ2లో ఐఫోన్ల ఎగుమతులు వార్షికంగా 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం కాగా, శాంసంగ్ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు పెరిగాయి. టాప్ 5 ఫోన్లకు సంబంధించి అమెరికాకు మోటరోలా ఫోన్ల ఎగుమతులు రెండు శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్ 13% పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్ 23% క్షీణించి 7 లక్షల యూనిట్లకు పరిమితమైంది.
క్యూ2లో తొలిసారి...
అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి క్యూ2లో భారత్ తొలిసారిగా అగ్రగామి తయారీ హబ్‌గా నిల్చిందని కెనాలిస్ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యమ్ చౌరాసియా తెలిపారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి వల్ల యాపిల్ తమ సరఫరా వ్యవస్థను భారత్‌కు మళ్లిస్తుండటం ఇందుకు దోహదపడిందని వివరించారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా యాపిల్ గత కొన్నేళ్లుగా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకుంటోందని చౌరాసియా చెప్పారు.
అయితే, ఐఫోన్ 16 సిరీస్, ప్రో మోడల్స్ తయారీని భారత్‌లో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్థాయిలో సరఫరా కోసం యాపిల్ ఇప్పటికీ చైనా తయారీ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వివరించారు. యాపిల్ తరహాలోనే మోటరోలా ఫోన్లకు కూడా ప్రధాన తయారీ హబ్‌గా చైనా నిలుస్తోంది. మరోవైపు, యాపిల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పరిమాణమే అయినప్పటికీ అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీని శాంసంగ్, మోటరోలా కూడా భారత్‌లోనే ఎక్కువగా చేపడుతున్నాయని చౌరాసియా పేర్కొన్నారు. శాంసంగ్ అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లను వియత్నాంలో ఉత్పత్తి చేస్తోంది.