
బడ్జెట్ అంచనాల్లో 29.9 శాతానికి చేరిక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం–వ్యయాల మధ్య అంతరం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై చివరికి (నాలుగు నెలల్లో) రూ.4,68,416 కోట్లకు చేరింది. 2025–26 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. మొదటి నాలుగు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 29.9 శాతానికి చేరింది. ఈ వివరాలను కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.2 శాతంగానే ఉండడం గమనించొచ్చు. జూలై చివరికి ప్రభుత్వానికి రూ.10.95 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.6.61 లక్షల కోట్లు పన్నుల రూపంలో రాగా, రూ.4.03 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం, రూ.29,789 కోట్లు నాన్ డెట్ రూపంలో (రుణేతర మార్గాలు) వచి్చంది. మొత్తం వ్యయాలు రూ.15.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.12.16 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కాగా, రూ.3.46 కోట్లు మూలధన రూపంలో ఖర్చయింది.